- 100% డిజిటల్ అక్షరాస్యతను సాధింపు
- దేశంలో తొలి పూర్తి లిటరసీ సాధించిన ఘనత
సహనం వందే, కేరళ:
అక్షరాస్యతలో ఇప్పటికే దేశానికి దిక్సూచిగా నిలిచిన కేరళ… ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యతలోనూ అదే మైలురాయిని అధిగమించింది. కేవలం 18 నెలల్లోనే ‘డిజి కేరళ’ కార్యక్రమం ద్వారా 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఓ మహా ఉద్యమంలా సాగిన ఈ ప్రయాణం… కోట్లాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.
స్వచ్ఛంద సైనికుల విజయగాథ
స్థానిక స్వపరిపాలన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘డిజి కేరళ’ కార్యక్రమం అపూర్వ విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం ప్రజల భాగస్వామ్యమే. 2.5 లక్షల మంది స్వచ్ఛంద సేవకులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి 21 లక్షలకు పైగా నిరక్షరాస్యులకు డిజిటల్ నైపుణ్యాలు నేర్పించారు. డిజిటల్ చెల్లింపుల నుంచి ఆన్‌లైన్ ప్రభుత్వ సేవలను వినియోగించుకోవడం, సాంకేతిక ప్రపంచంలో సురక్షితంగా ఎలా ఉండాలో ప్రజలకు చేతి పట్టుకుని నేర్పారు. ఈ కృషి ఫలితంగానే డిజిటల్ విప్లవం కేరళ గడప గడపకూ చేరింది.
వయసు ఒక అడ్డంకి కాదు!
‘డిజి కేరళ’ కార్యక్రమానికి ఆయువుపట్టుగా నిలిచిన ఓ సంఘటన దేశమంతటా చర్చనీయాంశమైంది. 104 ఏళ్ల వృద్ధుడైన మౌలవి డిజిటల్ శిక్షణ పొంది స్వయంగా సెల్ఫీ తీసుకున్న వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. నేర్చుకోవాలన్న తపన ఉంటే వయసు ఏమాత్రం అడ్డంకి కాదని ఆయన నిరూపించారు. ఈ ఒక్క ఘటన డిజిటల్ అక్షరాస్యత పట్ల కేరళ ప్రజలలో ఉన్న అంకితభావం, ఉత్సాహాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
మారిన జీవితాలు… సరికొత్త అవకాశాలు
డిజి కేరళలో పాల్గొన్నవారి అనుభవాలు ఈ కార్యక్రమం సాధించిన విజయానికి అద్దం పడుతున్నాయి. ఇది కేవలం శిక్షణ మాత్రమే కాదు ప్రతి ఒక్కరినీ డిజిటల్ ప్రపంచంలో భాగస్వామ్యం చేసేందుకు జరిగిన గొప్ప ప్రయత్నమని ఓ స్వచ్ఛంద సేవకుడు వివరించారు. ఈ శిక్షణ వారి జీవితాల్లో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు వారు ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఇ-గవర్నెన్స్ సేవలు, సామాజిక మాధ్యమాలను సులభంగా వినియోగించుకుంటున్నారు. ఈ డిజిటల్ నైపుణ్యాలు వారి వ్యక్తిగత, ఆర్థిక జీవితాల్లో ఎన్నో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచాయి.
దేశానికే దారి చూపే కేరళ మోడల్
1991లో అక్షరాస్యతలో మొదటి స్థానంలో నిలిచిన కేరళ… ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యతలోనూ అదే చరిత్రను పునరావృతం చేసింది. ఈ విజయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా ప్రజలకు నిజమైన సాధికారత ఎలా కల్పించవచ్చో డిజి కేరళ కార్యక్రమం నిరూపించిందని మంత్రి ఎం.బి. రాజేష్ తెలిపారు. ఈ చారిత్రక విజయం ద్వారా కేరళ డిజిటల్ యుగంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. ఇది కేవలం ఒక లక్ష్యం కాదు… భవిష్యత్తు కోసం వేసిన బలమైన పునాది.