- ఆడబిడ్డల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత
- దీనిపై పురుష ఉద్యోగుల్లో విమర్శల వెల్లువ
- ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో అమలు
- మహిళల నియామకంలో కంపెనీల అనాసక్తి?
సహనం వందే, బెంగళూరు:
కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన సంవత్సరానికి పన్నెండు రుతు మాసపు సెలవుల నిర్ణయం చారిత్రక ఘట్టం. ఉద్యోగం చేస్తూ ఇల్లు, కుటుంబాన్ని సమన్వయం చేసే మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని గుర్తించి ప్రభుత్వం వారికి ఆరోగ్యపరంగా ఊరట నిచ్చే ప్రయత్నం చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం దొరికిందని ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసు పని ఒత్తిడిని తగ్గించుకుని మెరుగైన పనితీరు చూపడానికి ఈ సెలవులు తోడ్పడతాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసుల్లో ఈ కొత్త నిర్ణయం అమలు కానుంది. అయితే ఈ హక్కు వెనుక దాగి ఉన్న సామాజిక రగడ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సమానత్వంపై కొత్త చర్చ...
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్త్రీ వర్గానికి ప్రత్యేక హక్కుగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం ఉన్నప్పుడు సెలవుల విషయంలో ఈ లింగ విభజన ఎందుకని పురుష ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కొందరు విమర్శకులు ఈ సెలవులు మహిళలను బలహీనంగా చూపిస్తాయని… ఉద్యోగ రంగంలో వారి సామర్థ్యంపై అనుమానాలు పెంచుతాయని వాదిస్తున్నారు. ఈ మొత్తం చర్చ మహిళల ఆరోగ్య హక్కులకు, సమానత్వ భావనలకు మధ్య ఒక సంఘర్షణను సృష్టించిందనడంలో సందేహం లేదు.
మహిళల నియామకంలో కంపెనీల అనాసక్తి
ఈ అదనపు సెలవులు ఉద్యోగ నియామకాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది మరో కీలకమైన చర్చ. ఎక్కువ సెలవులు ఇవ్వాల్సి వస్తుందనే భయంతో యజమానులు మహిళలను నియమించుకోవడానికి వెనుకాడతారని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తక్కువగా ఉన్న మహిళల ఉద్యోగ అవకాశాలు ఈ నిర్ణయం వల్ల మరింత తగ్గే ప్రమాదం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కంపెనీల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, దీర్ఘకాలంలో ఉద్యోగుల నమ్మకం పెరుగుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
దేశవ్యాప్త అమలుపై చర్చ…
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ సెలవులు దేశమంతటా అమలైతే మహిళల ఆరోగ్య హక్కులకు బలం చేకూరుతుందని కొందరు బలంగా నమ్ముతున్నారు. అయితే దీని అమలుకు యజమానుల సహకారం, సామాజిక అవగాహన, స్పష్టమైన విధానాలు అత్యవసరం. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు.