- అవినీతి ఆరోపణలు… మహిళపై వేధింపులు
- తాజాగా ఓ ఉద్యోగిని వేధించినట్లు ఫిర్యాదు
- ఆమె తరపున అధికారులకు నోటీసులు
- డిప్యూటేషన్లు లేవంటూనే… డబ్బులిస్తే ఓకే
- వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి విషపు కోరలు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ప్రజారోగ్య కార్యాలయం అవినీతికి, లైంగిక వేధింపులకు అడ్డాగా మారిందనేందుకు తాజా లీగల్ నోటీసు తిరుగులేని రుజువు. ఒక సీనియర్ అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అందులోనే పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఫిర్యాదు చేయడం వైద్య ఆరోగ్య శాఖలో సంచలనం అయింది. అంతేకాదు ఈ విషయంపై సంబంధిత మంత్రి దామోదర రాజనర్సింహ సహా ఉన్నతాధికారులకు లీగల్ నోటీసులు జారీ చేయడంతో యంత్రాంగం ఉలిక్కిపడింది. అవినీతి ఆరోపణలతో పాటు మహిళల వేధింపుల ఫిర్యాదులు నిత్యం ప్రభుత్వానికి అందుతున్నా పట్టించుకోకపోవడం వల్లే నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.


లక్ష ఇస్తే పని… ‘ఒప్పుకుంటే’ సహకారం
జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఉన్న ఆ మహిళా ఉద్యోగి డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీన్నే అదునుగా తీసుకున్న సూపరిండెండెంట్ హరి ఏకంగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు లక్ష రూపాయలకు అంగీకారం కుదిరింది. తొలుత 50 వేల రూపాయలు ఆమె ఆన్‌లైన్ ద్వారా చెల్లించారు. డబ్బులు తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు డిప్యూటేషన్ ఆర్డర్ ఇవ్వలేదు. అంతేకాక ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కు ఇవ్వలేదు. పైగా ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. అలాగే తన డిప్యూటేషన్ ప్రక్రియ జరగకుండా అడ్డుకున్నారని లీగల్ నోటీసులో ప్రస్తావించారు.
ఆధారాలున్నా పట్టించుకోని పై అధికారులు…
ఈ కేసులో బాధితురాలి వద్ద ఆ సీనియర్ అధికారికి సంబంధించిన వాట్సాప్ చాట్‌లు, ఫోన్ కాల్స్, ఆడియో క్లిప్‌ల రూపంలో డిజిటల్ రికార్డులు ఉన్నాయి. డబ్బులు చెల్లించినట్లు కూడా ఆమె వద్ద స్పష్టమైన ఆధారం ఉంది. ఇన్ని కీలక ఆధారాలు ఉన్నప్పటికీ ఫిర్యాదుల తరువాత ఆ సంబంధిత ఆ అధికారిని సస్పెండ్ చేయకుండా రివార్డు ఇవ్వడం ప్రభుత్వ అవినీతికి పచ్చజెండా చూపడమే అవుతుందని లీగల్ నోటీసులో తీవ్రంగా ధ్వజమెత్తారు.
కోట్లలో అక్రమాలు… అవినీతి సామ్రాజ్యం
ఈ లైంగిక వేధింపుల ఘటన ఒక్కటే కాదని… ఇది ప్రజారోగ్య కార్యాలయంలోని వ్యవస్థీకృత అవినీతిలో భాగమని న్యాయవాది నోటీసు ఆరోపించింది. డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తి ఒక అవినీతి రాకెట్‌కు సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్ సెక్షన్‌లో కొందరు ఉద్యోగులు కుమ్మక్కై కమీషన్లు వసూల్ చేస్తున్నట్లు వరుసగా ఫిర్యాదులు అందాయి. గత రెండేళ్లలో డిప్యుటేషన్లు, బదిలీలు, ప్రమోషన్లు ఇప్పించేందుకు ఆయన కోట్ల రూపాయలు వసూలు చేశారని, మొత్తం అక్రమాల విలువ భారీగా ఉండవచ్చని నోటీసు అంచనా వేసింది. సీనియారిటీ జాబితాలను తొక్కిపట్టి ప్రమోషన్లలో అక్రమాలు చేయించి అవినీతి సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు.
తక్షణమే వేటు వేయండి!
న్యాయవాది నోటీసు ద్వారా ఆమె తెలంగాణ ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖకు పలు విన్నపాలు చేశారు. ఆ అధికారిని తక్షణమే సస్పెండ్ చేసి ఆయనపై అవినీతి, లంచం, లైంగిక వేధింపులు, దళిత ఉద్యోగిపై అఘాయిత్యాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ అక్రమాలపై ఏసీబీ లేదా విజిలెన్స్ వంటి సంస్థలతో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. తన క్లయింట్‌తో సహా అవినీతిని ప్రతిఘటించిన విజిల్ బ్లోయర్‌లకు తక్షణ రక్షణ కల్పించాలని ఆ న్యాయవాది డిమాండ్ చేశారు. ఈ తీవ్ర ఆరోపణలపై ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని నోటీసులో హెచ్చరించారు.