- 2023లో 10,786 మంది బలవన్మరణం
- పదేళ్లలో దేశంలో లక్ష మంది ఆత్మహత్య
- మహారాష్ట్ర, కర్ణాటకల్లో అత్యధిక కేసులు
- తెలంగాణలో వెలుగు చూడని లెక్కలు
- బీఆర్ఎస్ హయాంలో 7,064 ఆత్మహత్యలు?
సహనం వందే, న్యూఢిల్లీ:
2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు, కూలీలు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాల ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం ఏటా పది వేలకు పైగా రైతు జీవితాలు గాలిలో కలిసి పోవడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ విధానాల్లోని లోపాలు, అందని సాయం, పెరిగిన రుణ భారం రైతన్నలను ఈ దారుణమైన స్థితికి నెట్టాయి. ఈ సంక్షోభం వెనుక ఉన్న రాజకీయ కోణాలు, ప్రభుత్వాల మొండి వైఖరిని పరిశీలించాల్సిన అవసరం ఉంది.

మహారాష్ట్ర, కర్ణాటకలో రక్తపాతం…
రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర (4,151), కర్ణాటక (2,423) రాష్ట్రాలు ముందుండటం పాలక పక్షాల నిస్సత్తువను తెలియజేస్తోంది. ఈ రెండు రాష్ట్రాలు కలిపి దేశవ్యాప్త రైతు ఆత్మహత్యల్లో 60 శాతం ఉన్నాయి. పత్తి, చెరకు వంటి వాణిజ్య పంటల సాగు కోసం తీసుకున్న భారీ రుణాల ఊబిలో రైతులు కూరుకుపోయి ప్రభుత్వాల నుండి తగిన సాయం లేక కుమిలిపోతున్నారు. రైతు సంక్షేమం పేరుతో పథకాలు ప్రకటిస్తున్నా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రలో పథకాల మాయాజాలం…
ఆంధ్రప్రదేశ్‌లో 925 మంది రైతులు, కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే ఉండటం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. అధికార పార్టీలు రైతు సంక్షేమంపై హామీలు గుప్పించినా కూలీలకు కనీస వేతనం, ఉపాధి భద్రత కల్పించడంలో విఫలమయ్యాయి. పంటల బీమా, రుణ సదుపాయాలు రైతుల చేతికి అందక కాగితాలకే పరిమితమైనాయని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం రైతు పేరును వాడుకుని, ఆ తరువాత వారి సమస్యలను గాలికొదిలేసే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణలో లెక్కల్లో తేడా…
తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంఖ్యలో గణాంకాల లోపాలు, రాజకీయ మలుపులు ప్రస్ఫుటమవుతున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రైతు ఆత్మహత్యలు 95 శాతం తగ్గాయని ఆ పార్టీ నాయకులు చెప్పుకొచ్చినా... సివిల్ సొసైటీ ఫాక్ట్‌షీట్లు మాత్రం 2014-2023 మధ్య 7,064 రైతు ఆత్మహత్యలు జరిగినట్లు చెబుతున్నాయి.
ఆత్మహత్యల అంశం: రాజకీయాల అస్త్రం
రైతు ఆత్మహత్యల సమస్యను రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నాయే తప్ప దీర్ఘకాలిక పరిష్కారాల కోసం కృషి చేయడం లేదు. అధికార పార్టీల వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎండగట్టడం మినహా రైతులకు ఆర్థిక భద్రత, రుణ ఊరట కల్పించే విషయంలో చేతులు కలపడం లేదు.