అభిమానులతో ‘ఫుట్‌బాల్’ – ప్రపంచ కప్ ఒక్క టికెట్ రూ. 8.87 లక్షలు

  • ఫుట్ బాల్ ప్రపంచ కప్ ధరల దండయాత్ర!
  • అంతర్జాతీయ సమాఖ్య తీరుపై విమర్శలు
  • కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో రేట్లు
  • వచ్చే ఏడాది నుంచి ఫుట్ బాల్ ప్రపంచ కప్

సహనం వందే, అమెరికా:
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక 2026 ప్రపంచ కప్ మ్యాచ్‌ల టికెట్ల ధరల రహస్యం ఎట్టకేలకు బద్దలైంది. మొదట ధరలను గోప్యంగా ఉంచిన ఫిఫా… అతి తక్కువ ధరలు సుమారు రూ. 5,300 నుంచి మొదలవుతాయని మాత్రమే సెప్టెంబర్‌లో ప్రకటించింది. కానీ టికెట్ లాటరీలో గెలిచిన అభిమానులు ధరకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ధరలు సామాన్య అభిమానులకు ఆకాశాన్ని తాకే విధంగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో అప్పర్ డెక్ సీట్లు ఏకంగా రూ. 3.73 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇది టికెట్ల దండయాత్రే అని చెప్పక తప్పదు.

గ్రూప్ మ్యాచ్‌ల ధరలు… అన్నీ లక్షల్లోనే!
గ్రూప్ మ్యాచ్‌లలో కూడా ధరల పెంపు ఉధృతంగా ఉంది. అమెరికా పురుషుల జట్టు మ్యాచ్‌లు మినహా ఇతర గ్రూప్ మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలు చూస్తే… సోఫీ స్టేడియం, లెవిస్ స్టేడియం, మెట్లైఫ్ స్టేడియంలలో అత్యధిక ధరలు నమోదు కావడం గమనార్హం. కేటగిరీ వన్ టికెట్లు రూ. 3.63 లక్షలు నుంచి రూ. 5.50 లక్షల వరకు ఉండగా, కేటగిరీ టూ టికెట్లు కూడా రూ. 3.10 లక్షలు నుంచి రూ. 4.12 లక్షల వరకు ఉన్నాయి. కేటగిరీ త్రీ మాత్రం రూ. 12,400 నుంచి రూ. 19,200 వరకు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధర కేటగిరీ ఫోర్ లో రూ. 5,300 నుంచి రూ. 9,300గా ఉంది. లోయర్ బౌల్, అప్పర్ డెక్ ఆధారంగానే ఈ కేటగిరీలు నిర్ణయించారు.

ఆతిథ్య దేశాల ఓపెనర్లు: మెక్సికో బెటర్
ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న దేశాల ఓపెనర్ మ్యాచ్‌ల ధరలు వేర్వేరుగా ఉన్నాయి. మెక్సికో ఓపెనర్ మ్యాచ్‌లో కేటగిరీ వన్ టికెట్ ధర సుమారు రూ. 1.70 లక్షలుగా ఉండగా, అత్యల్పంగా కేటగిరీ ఫోర్ టికెట్ ధర రూ. 3,300కి దొరుకుతోంది. అయితే కెనడా ఓపెనర్‌లో అత్యధిక ధర రూ. 1.55 లక్షలు వరకు ఉంది. అమెరికా ఓపెనర్‌లో అత్యధిక ధర రూ. 2.43 లక్షల వరకు చేరుకుంది.

నాకౌట్‌లో మరింత భారమే!
నాకౌట్ రౌండ్‌లకు వచ్చేసరికి ధరల పెరుగుదల మరింత భయానకంగా తయారైంది. రౌండ్ ఆఫ్ ముప్పైరెండు మ్యాచ్‌లలో అత్యధిక ధర రూ. 5.90 లక్షలు వరకు పలుకుతోంది. ముఖ్యంగా లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ న్యూజెర్సీలలో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. రౌండ్ ఆఫ్ పదహారులో అత్యధిక ధర రూ. 7.90 లక్షలు వరకు ఉంది. ఇక క్వార్టర్ ఫైనల్‌లో లాస్ ఏంజిల్స్‌లో అత్యధిక ధర రూ. 1.50 లక్షలు కాగా, సెమీ ఫైనల్‌లో డల్లాస్‌లో అత్యధిక ధర రూ. 2.47 లక్షలుగా ఉంది.

ఫైనల్‌కు లక్షలు పెట్టాల్సిందే…
ప్రపంచ కప్ తుది పోరు చూడాలంటే కోటీశ్వరులకే సాధ్యం అన్నట్టుగా ధరలు ఉన్నాయి. మూడో స్థానం మ్యాచ్‌లోనే అత్యధిక ధర రూ. 8.87 లక్షలు వరకు ఉండగా… ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు రూ. 5.10 లక్షలు నుంచి మొదలవుతున్నాయి. అభిమానుల ఆశలను ఫిఫా ఎలా దండుకోవడానికి ప్రయత్నిస్తుందో ఈ ధరలే నిదర్శనం. ఇప్పటికే నాలుగున్నర మిలియన్ల మంది వీసా ప్రీసేల్ డ్రాలో పాల్గొన్నారు. ఒక వ్యక్తి 40 టికెట్లు కొనేందుకు అవకాశం ఉన్నా, ఒక్క మ్యాచ్‌కు నాలుగు మాత్రమే కొనాలి. అర్జెంటీనా, బ్రెజిల్ టీమ్ స్పెసిఫిక్ ప్యాకేజీల ధరలు రూ. 8.25 లక్షలు వరకు ఉన్నాయి. సాధారణ అభిమాని ఈ ప్రపంచ కప్ చూసేందుకు టికెట్ కొనగలడా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *