టీసీఎస్‌ లో ఉద్యోగాల ఊచకోత – నైపుణ్యం లేదంటూ12 వేల మంది బలి

  • టాటా దిగ్గజం ఉద్యోగుల గొంతు నొక్కే కుట్ర
  • క్లయింట్ డిమాండ్లు… ఆటోమేషన్ సాకు
  • ఉద్యోగం పోయినవారికి మెంటల్ హెల్త్ సపోర్ట్
  • ఇంతకుమించి దిక్కుమాలిన పని ఏముంది?
  • సామాజిక బాధ్యత అంటూ పైకి గొప్పలు

సహనం వందే, న్యూఢిల్లీ:
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) దేశ ఐటీ రంగంలో గొప్పలు చెప్పుకునే సంస్థ. కానీ ఇప్పుడు తన ఉద్యోగులను రోడ్డున పడేసే దుర్మార్గానికి ఒడిగట్టింది. 12,000 మంది ఉద్యోగులను అంటే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం మందిని ఏడాది కాలంలో తొలగించేందుకు ఈ కార్పొరేట్ కంపెనీ కత్తి సానబెట్టింది. క్లయింట్ డిమాండ్లు, ఆటోమేషన్, కొత్త టెక్నాలజీ అవసరాలను సాకుగా చూపుతూ మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగుల జీవితాలను చిదిమేస్తోంది. దశాబ్దాలుగా కంపెనీకి చెమటోడ్చి సేవలందించిన వారిని ఇలా నిర్దాక్షిణ్యంగా బలిచేయడం సిగ్గుమాలిన చర్య కాదా? నైపుణ్యాలు సరిపోలేదని, అప్‌స్కిల్ కాలేదని చెప్పి, ఉద్యోగులను మరుభూమికి నెట్టడం ఏ రకం నీతి? ఈ కోతలు కంపెనీ లాభాల కోసమే కాదా?

సెవరెన్స్ ప్యాకేజీ… కపట నాటకం
టీసీఎస్ తన కపట దాతృత్వాన్ని చాటుకుంటూ ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు వేతనంతో సెవరెన్స్ ప్యాకేజీ ఇస్తామంటోంది. కానీ ఈ డబ్బు ఉద్యోగుల జీవితాలను గాడిలో పెట్టగలదా? ఎనిమిది నెలలకు పైగా బెంచ్‌లో ఉన్నవారిని మూడు నెలల నోటీసు వేతనంతో ఊరడించడం దారుణం.10-15 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి ఒకటిన్నర ఏళ్ల వేతనం… 15 ఏళ్లకు పైగా ఉన్నవారికి రెండేళ్ల వేతనం ఇస్తామని గొప్పలు చెప్పినా వారిని మభ్యపెట్టే దుర్మార్గ చర్య. మూడు నెలల ఏజెన్సీ ఫీజు కవరేజ్ ఇస్తారట. మరీ విచిత్రం ఏంటంటే ఉద్యోగం కోల్పోయిన వారే బాధపడుతుంటే వారికి టీసీఎస్ కేర్స్ పేరిట మానసిక ఆరోగ్య సపోర్ట్ అంటూ పిచ్చి ప్రచార చేస్తున్నారు.

ఉరితాడు చూపించి ఊరడింపు
అర్హులైన ఉద్యోగులకు ఎర్లీ రిటైర్మెంట్ ఇస్తామని… పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో అదనపు సెవరెన్స్ ఇస్తామని టీసీఎస్ గొప్పగా చెబుతోంది. కానీ ఈ ఆప్షన్ ఎంతమందికి చేరుతుంది? రీసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ ద్వారా కొత్త ప్రాజెక్టులు అన్వేషించే అవకాశం ఇస్తున్నామని చెప్పినా ఇది కేవలం కంటితుడుపు చర్య. దశాబ్దాలుగా కంపెనీకి చెమటోడ్చిన ఉద్యోగులను ఇలా అడ్డగోలుగా తొలగించడం టీసీఎస్ దురాగతాన్ని బట్టబయలు చేస్తోంది. సామాజిక బాధ్యత అంటూ గొప్పలు చెప్పే ఈ సంస్థ… ఉద్యోగుల జీవితాలను నాశనం చేస్తూ కార్పొరేట్ కసాయిగా మారింది. ఇది సమాజంలో టీసీఎస్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని విమర్శకులు అంటున్నారు. ఇలాంటి దుర్మార్గాలు ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

మార్కెట్‌లో షేర్ల పతనం…
ఈ ఉద్యోగ ఊచకోత వార్తలతో టీసీఎస్ షేర్లు 0.94 శాతం దిగజారి రూ. 2,932.50కి చేరాయి. టెక్ మహీంద్రా షేర్లు కూడా 1.03 శాతం పతనమై రూ. 1,429.05కి పడిపోయాయి. ఆటోమేషన్, నైపుణ్యాల పునర్మితి అంటూ టీసీఎస్ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నట్లు కనిపిస్తున్నా ఉద్యోగుల జీవనోపాధిని నిర్లక్ష్యం చేసే ఈ దుష్ట చర్యలు సంస్థపై విశ్వాసాన్ని బీటలు వారుస్తున్నాయి. లాభాల కోసం ఉద్యోగుల రక్తం తాగే ఈ కార్పొరేట్ కసాయితనం టీసీఎస్‌ను దేశ ఐటీ రంగంలో నీతిరహిత సంస్థగా చిత్రీకరిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *