‘షీ’ని వదిలేసిన ‘టీమ్స్’ – షీ టీమ్స్ ఉన్నా మహిళల భద్రత సున్నా

  • హైదరాబాద్ నడిబొడ్డున మహిళ హత్య
  • అత్యాచారం చేసి చంపేసిన ఆటో డ్రైవర్లు
  • సహకరించలేదని మర్మాంగాలను పొడిచారు
  • క్రూరత్వానికి పరాకాష్టగా స్త్రీ మూర్తి హత్య
  • హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ కేంద్రంగా సిటీ
  • నగరంలో మహిళలు బయటకు రావొద్దా?
  • రక్షణ కల్పించడంలో పోలీసుల ఘోర వైఫల్యం

సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్‌లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నగర శివారులోని రాజేంద్రనగర్‌లో జరిగిన దారుణ ఘటన నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కనీసం మానవత్వం కూడా లేకుండా కొందరు మృగాలుగా మారి ఒక మహిళను అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ ఘటన సమాజాన్ని కలవరపెట్టడంతోపాటు పోలీసుల పనితీరుపై కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటికీ మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. ఘోరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడమే తమ గొప్పతనంగా పోలీసులు భావిస్తున్నట్లు జనం మండిపడుతున్నారు. క్రైమ్ నివారించడానికి బదులు… జరిగిన తర్వాత హడావుడి కనిపిస్తుందని అంటున్నారు. పోలీసులు వాహనాల చలాన్లు… రొటీన్ కేసులకే పరిమితం అవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

ఆటోడ్రైవర్ల అఘాయిత్యం…
రాజేంద్రనగర్ కిస్మత్‌పూర్ బ్రిడ్జి కింద కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యం కావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. యాకుత్‌పూరా నుంచి హైదర్‌గూడాకు వచ్చిన 35 ఏళ్ల ఆ మహిళ రోడ్డుపై పడిపోయింది. ఇది గమనించిన ఇద్దరు ఆటోడ్రైవర్లు ఆమెను ఆటోలో ఎక్కించుకుని కిస్మత్‌పూర్ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లారు. అక్కడ దారుణంగా అత్యాచారం చేశారు. ఆమె సహకరించకపోవడంతో కోపంతో దారుణంగా కొట్టి వివస్త్రను చేసి, మర్మాంగాల్లో కర్రలు గుచ్చి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ బృందం, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు.

పట్టుబడ్డ హంతకులు… పోలీసుల నిర్లక్ష్యం?
ఈ కేసును ఛేదించడానికి రాజేంద్రనగర్ పోలీసులు ఐదు రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలు, మిస్సింగ్ పర్సన్స్ రిపోర్టులు, డాగ్ స్క్వాడ్ సాయంతో హంతకులను పట్టుకున్నారు. నిందితులు ఇద్దరూ ఆటోడ్రైవర్లే. స్థానికంగా తెలిసినవారే. పోస్ట్‌మార్టమ్ నివేదికలో ఆమెపై అత్యాచారం, క్రూరమైన హత్య జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనతో హైదరాబాద్‌లో రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించాలంటే మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. పోలీసులు ఈ కేసును త్వరగా పూర్తి చేసి కోర్టుకు విచారణ కోసం పంపిస్తామని తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు.

వ్యవస్థా వైఫల్యం… ప్రజల ఆందోళన
ఈ అమానుషమైన హత్య హైదరాబాద్ పోలీసు వ్యవస్థ, పరిపాలనా లోపాలను బహిర్గతం చేసింది. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటి అమలులో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి సమయాల్లో రోడ్లపై పోలీసుల గస్తీ లేకపోవడం, పనిచేయని సీసీటీవీ కెమెరాలు, ఆటోడ్రైవర్ల గురించి సరైన వివరాలు సేకరించకపోవడం వంటివి ఈ ఘటనలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి నేరాలు తగ్గకపోవడం విచారకరం. పోలీసులు ఐదు రోజులు తీసుకోవడం కూడా వ్యవస్థలోని బలహీనతను చూపుతోంది. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది.

కఠిన చర్యలు తప్పనిసరి…
ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆటో, ఓలా, ఉబర్ డ్రైవర్ల పూర్తి వివరాలు సేకరించి వారిపై నిఘా ఉంచాలి. రాత్రిపూట గస్తీని పెంచాలి. పనిచేయని సీసీటీవీలను వెంటనే మరమ్మత్తు చేయాలి. మహిళలకు ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ ఘటన మహిళల హక్కుల కోసం పోరాటానికి ఒక ఆయుధంగా మారాలి. ప్రభుత్వం, పోలీసులు, సమాజం కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలి. లేకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ మహిళలకు ఒక సురక్షితమైన నగరంగా ఉండదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *