రక్తచరిత్రకు నేతల తహతహ – గతంలో జగన్ ‘రప్పా రప్పా’ ఫ్లెక్సీ వివాదం

  • మొన్న హైదరాబాదులో పవన్ కత్తి దూయడం
  • ఆంధ్రప్రదేశ్ నేతలు ఇస్తున్న సందేశం ఏంటి?
  • రాజకీయ ముసుగులో రక్తం పారిస్తారా?
  • ఇద్దరు నేతల తీరుపై జనంలో అసంతృప్తి
  • సిద్ధాంతాలు వదిలి కత్తులపై నేతల మోజు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:
జనాన్ని రెచ్చగొట్టడానికి మన నేతలు కత్తులు వాడుతున్నారు. పరోక్షంగా నెత్తుటి రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. సినిమాల్లోనూ నిషేధించాల్సిన కత్తుల నెత్తురు చిత్రాలను… బయట కూడా ప్రదర్శించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలో వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడాన్ని అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న హైదరాబాదులో జరిగిన ఓజీ సినిమా ఫంక్షన్ లో స్టేజి మీద కత్తి దూయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. రాజకీయంగా ఉన్నత పదవిలో ఉన్న ఒక ప్రజా ప్రతినిధి ఇలాంటి స్టంట్‌లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది భద్రతా లోపాలకు దారితీస్తుందని, సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

రాజకీయాలకు సినిమా పోకడలు…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కత్తి పట్టుకొని స్టేజ్‌పైకి వచ్చారు. సినిమా పోస్టర్ ముందు కత్తిని ఊపుతూ చేసిన ఈ స్టంట్ ప్రమాదకరంగా మారి వెనుక ఉన్న బాడీగార్డ్‌కు మిల్లీమీటర్ల తేడాతో తప్పింది. ఈ వీడియో వైరల్ కావడంతో పవన్ అభిమానులు ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, విమర్శకులు మాత్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి బాధ్యతారహితమైన పనులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్టర్‌పై ‘పుష్ప’ సినిమాలోని ‘రప్ఫా రప్పా’ డైలాగ్‌ను పెట్టడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పవన్ ఏకంగా కత్తి పట్టుకుని రంగంలోకి దిగడంపై కూడా అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన పవన్ సినిమా ఈవెంట్లలో సమయం వృథా చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

బాడీగార్డుకు తప్పిన ప్రమాదం…
పవన్ కల్యాణ్ కత్తి తిప్పుతున్న సమయంలో ఆయన వెనుక ఉన్న బాడీగార్డు ప్రాణభయంతో వెనక్కి వెళ్ళిపోయారు. ఈ దృశ్యం భద్రతా నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక రాజకీయ నాయకుడు, అందులోనూ అత్యంత సెక్యూరిటీ ఉన్న వ్యక్తి ఇలాంటి రిస్క్ తీసుకోవడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు.

గతంలో వారాహి యాత్రలో కూడా పవన్ ఇలాంటి స్టంట్‌లు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తిగా ఇలాంటి చర్యలు మరింత ప్రమాదకరం. ఇది ఆయన వ్యక్తిగత భద్రతతో పాటు ఆయన చుట్టూ ఉన్న వారి భద్రతను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది.

సమాజానికి తప్పుడు సందేశం
పవన్ కల్యాణ్ ఈ స్టంట్‌ను కేవలం సినిమా ప్రమోషన్ కోసమే చేశారని అభిమానులు చెబుతున్నారు. అయితే ఒక ప్రజా ప్రతినిధిగా ఆయన రాజకీయాల్లోనూ హీరోలానే ఉండాలని ఈ స్టంట్‌తో పరోక్షంగా చెప్పినట్లయింది. యువత, అభిమానులు ఇలాంటి చర్యలను ధైర్యంగా భావించి అనుకరిస్తే, అది సమాజంలో మరింత ప్రమాదకరమైన పోకడలకు దారితీస్తుంది. తమిళనాడులో కూడా ఈ సంఘటన చర్చనీయాంశమైంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకునేవారు. ఇప్పుడు సినిమా నాయకులు రాజకీయాల్లోకి రాగానే సినిమాలకు మాత్రమే పరిమితమయ్యే స్టంట్‌లను రాజకీయాల్లో కూడా తీసుకొస్తున్నారు. ఇది రాజకీయాల యొక్క సీరియస్‌నెస్‌ను తగ్గించి వాటిని కేవలం వినోదంగా మార్చేస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *