పరువునష్టం నీడలో పగ – డిఫమేషన్ చట్టంతో స్వేచ్ఛకు సంకెళ్లు

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర ఆవేదన
  • పరువు నష్టం కేసులతో రాజకీయ కక్షలు
  • రాజకీయ శత్రువును వేధించేందుకేనని వెల్లడి
  • పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తున్నట్లు విమర్శ
  • దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇలాంటి కేసులు
  • ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని పిలుపు

సహనం వందే, న్యూఢిల్లీ:
పరువు నష్టం చట్టం (డిఫమేషన్ లా) ఒక వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి బదులుగా రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, జనం గొంతు నొక్కడానికి ఒక ఆయుధంగా మారిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర కుమార్ గోపు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరును ఆయన కామెంట్స్ స్పష్టం చేశాయి. ఆయన ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని సూచించడంతో దేశంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.

రాజకీయ వేధింపుల ఆయుధం…
భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం నేరంగా పరిగణిస్తారు. ఇది రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు తమ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతోంది. ఎన్నికల సమయంలో లేదా ఇతర వివాదాల్లో ఒక వ్యక్తి ఈ సెక్షన్ల కింద ఫిర్యాదు చేస్తే పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి నిందితులను ఇబ్బందులకు గురిచేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఈ చట్టాన్ని రాజకీయ నాయకులు, ధనవంతులు తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణచివేయడానికి ఉపయోగిస్తున్నారని జస్టిస్ గోపు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థపై భారం పెంచడమే కాకుండా అసలు నేరాల విచారణకు అడ్డంకిగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

స్వేచ్ఛకు సంకెళ్లు.‌‌.. మాట హక్కుకు ముప్పు
భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది. కానీ పరువు నష్టం చట్టం ఈ హక్కును తీవ్రంగా దెబ్బతీస్తోంది. జస్టిస్ గోపు అభిప్రాయం ప్రకారం… ఈ చట్టం వ్యక్తిగత గౌరవాన్ని కాపాడటానికి బదులుగా భయాన్ని పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో పరువు నష్టం కేసులను కేవలం సివిల్ కేసుగా మాత్రమే పరిగణిస్తారు. భారతదేశంలో మాత్రం జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలు, మీడియా, విమర్శకులు భయం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల భావప్రకటన స్వేచ్ఛ మరింత బలపడుతుందని జస్టిస్ గోపు నమ్మకం వ్యక్తం చేశారు.

చట్ట సంస్కరణల దిశగా…
సుప్రీం కోర్టు ఇప్పటికే డిఫమేషన్ చట్టం దుర్వినియోగం గురించి కొన్ని కీలక తీర్పులు ఇచ్చింది. 2016లో సుబ్రతా రాయ్ కేసులో ఈ చట్టం దుర్వినియోగాన్ని నివారించాలని సూచించింది. ఇప్పుడు జస్టిస్ గోపు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌లో ఈ చట్టంలో మార్పులు తీసుకురావడానికి ఒత్తిడి పెంచుతున్నాయి. భవిష్యత్తులో ఈ చట్టాన్ని సివిల్ కేసుగా మార్చడానికి ప్రభుత్వం కమిషన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మార్పు దేశ రాజకీయాల్లో ఆరోగ్యకరమైన చర్చకు దారి తీస్తుంది, ప్రజల స్వేచ్ఛకు భరోసా ఇస్తుంది. తద్వారా న్యాయవ్యవస్థపై భారం కూడా తగ్గుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *