- దొంగ ఓట్లను ఆపే శక్తి వారికే ఉందని వ్యాఖ్య
- కాంగ్రెస్ అగ్రనేత కామెంట్స్ పై కొత్త వివాదం
- రాహుల్ వ్యూహమా? రాజకీయ ఎత్తుగడా?
సహనం వందే, న్యూఢిల్లీ:
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది. నేపాల్ తరహా జెన్ జెడ్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉండటంపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. ఆయన ప్రత్యేకంగా జెన్ జెడ్ అని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇటీవల నేపాల్‌లో జెన్ జెడ్ యువత భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టారు. ఆ నిరసనలు హింసాత్మకంగా మారి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాత్కాలికంగా సుశీల కర్కీ బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామాల తర్వాత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం పది రోజుల్లోనే నేపాల్ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. జెన్ జెడ్ యువత చేపట్టిన ఉద్యమంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇలా అనేక దేశాల్లో రాజకీయ ఉద్యమాలు కొనసాగుతున్నాయి.

బంగ్లా స్ఫూర్తి కూడా ఉందా?
బంగ్లాదేశ్‌లోనూ విద్యార్థి సంఘాలు, ఇస్లామిక్ సంస్థలు పెద్ద ఎత్తున నిరసనలు చేసి షేక్ హసీనాను గద్దె దించారు. ఈ రెండు దేశాల్లో జెన్ జెడ్ పాత్ర విశేషమైంది. రాహుల్ గాంధీ భారత్‌లోనూ అలాంటి వాతావరణం రావాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్నను బీజేపీ మద్దతుదారులు లేవనెత్తుతున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 6 వేల ఓట్లు తొలగించారని ఆయన విమర్శించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని, నకిలీ లాగిన్‌లు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ఫోన్ నంబర్లను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం పూర్తిగా కొట్టిపారేసింది. ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేసింది. బీజేపీ నేతలు కూడా ఇదే స్వరం వినిపిస్తూ ఓటమి భయంతో రాహుల్ ఇలా మాట్లాడుతున్నారని అన్నారు.
రాహుల్ కొత్త వ్యూహమా?
ఈ వాదోపవాదాల మధ్య రాహుల్ ట్వీట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. యువత, విద్యార్థులు, జెన్ జెడ్ తరం రాజ్యాంగాన్ని కాపాడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటు దొంగతనాన్ని ఆపగల శక్తి వారికే ఉందని, తాను ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటానని ప్రకటించారు. రాహుల్ గాంధీ జెన్ జెడ్ పై ఇంత నమ్మకం ఉంచడం ఆయన రాజకీయ వ్యూహంలో భాగమా లేక యాదృచ్ఛికమా అనే సందేహం పెరుగుతోంది. ఇదంతా చూసి బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశాన్ని నేపాల్, బంగ్లాదేశ్‌లా కల్లోలంలోకి నెట్టాలనే ఉద్దేశంతోనే రాహుల్ జెన్ జెడ్ ప్రస్తావించారని ఆరోపిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు మరింత దూకుడైన రాజకీయ యుద్ధానికి నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ యువత ప్రపంచంలోని ప్రభుత్వాల అవినీతి, అణచివేత ధోరణులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దీన్ని గమనించే రాహుల్ గాంధీ ట్వీట్ చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.