- ఆటోమొబైల్ రంగంలో వినూత్న బిజినెస్
- యువ కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యం
- ఎల్లుండి నుంచి ఆర్డర్ చేసుకునేలా కసరత్తు
సహనం వందే, ముంబై:
మోటార్ సైకిల్ ప్రేమికులను ఆకర్షిస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తో జతకట్టి తమ 350సీసీ బైక్‌లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. సోమవారం నుంచి బెంగళూరు, గురుగ్రామ్, కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. క్లాసిక్ లుక్, గంభీరమైన ఇంజన్ సౌండ్‌తో ప్రసిద్ధి చెందిన ఈ బైక్‌లను ఇకపై మొబైల్ స్క్రీన్‌పై నుంచే కొనుగోలు చేసుకోవచ్చు. యువత ఆన్‌లైన్ షాపింగ్‌పై చూపుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇంటి వద్దకే డెలివరీ, సులభమైన చెల్లింపులు వంటి సౌకర్యాలు బైకర్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.
350సీసీ మోడల్స్ మ్యాజిక్…
ఫ్లిప్‌కార్ట్‌పై అందుబాటులోకి వచ్చే మోడల్స్‌లో క్లాసిక్ 350, బుల్లెట్ 350, మెటియోర్ 350, హంటర్ 350, గొరిల్లా 350 ఉన్నాయి. ప్రతి మోడల్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేక శైలిని ప్రతిబింబిస్తుంది. క్లాసిక్ 350 రెట్రో అనుభూతిని ఇస్తే, బుల్లెట్ 350 దాని లెగసీని కొనసాగిస్తుంది. మెటియోర్ 350, హంటర్ 350, గొరిల్లా 350 వంటి మోడళ్లు నగర ప్రయాణాలకు, సాహసాలకు అనువుగా ఉంటాయి. ఈ మోడల్స్ అన్నింటిలోనూ 349సీసీ ఇంజన్, 20 హార్స్ పవర్, 27 టార్క్ వరకు పనితీరును అందిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌పై అన్ని ఫీచర్లను వివరంగా పరిశీలించి ఆర్డర్ చేయవచ్చు. ఇది బైక్ కొనుగోలును మరింత సులభతరం చేస్తుంది.
సిటీ వైజ్ స్టార్టప్… బ్రాండ్ వ్యూహం
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఆన్‌లైన్ విక్రయాలను మొదట ఐదు ప్రధాన నగరాల్లో ప్రారంభించడం వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. టెక్ హబ్ బెంగళూరు, ఆర్థిక రాజధాని ముంబై, కార్పొరేట్ హబ్ గురుగ్రామ్, సాంస్కృతిక కేంద్రం కోల్‌కతా, ఉత్తరప్రదేశ్ నడిబొడ్డున ఉన్న లక్నోలో బైక్ ప్రియుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా మోడళ్లను ఎంచుకుని, రంగులు, వేరియేషన్లను ఎంచుకుని ఆర్డర్ ఇవ్వవచ్చు. డెలివరీ తర్వాత రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ప్రక్రియలు కూడా సులభంగా పూర్తవుతాయి. ఈ వ్యూహంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ డిజిటల్ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటుంది. త్వరలో ఇతర నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.
యువ కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యం…
ఫ్లిప్‌కార్ట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ భాగస్వామ్యం బైక్ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది యువ కస్టమర్లను ఆకర్షించడమే కాకుండా బైక్ కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుంది. దాదాపు రూ. 1.85 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్య ఉండే ఈ బైక్‌లను ఇకపై ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయవచ్చు. డిజిటల్ యుగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది.