పట్టుచీరతో రాజకీయ ఎత్తు’గడ(ల)’ – బతుకమ్మ నీడలో పునః ప్రవేశం

  • మళ్లీ ప్రజల్లోకి ప్రజారోగ్య మాజీ సంచాలకులు
  • 21 నుంచి రోజుకో మహిళకు పట్టుచీర గిఫ్ట్
  • ఆయన పునః ప్రవేశం వెనుక బీఆర్ఎస్?
  • కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానంపై కన్ను
  • వచ్చే ఎన్నికల్లో గెలవడమే ప్రధాన లక్ష్యం

సహనం వందే, హైదరాబాద్:
కొన్నాళ్లుగా కనుమరుగైన ప్రజారోగ్య మాజీ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఈనెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొత్తగూడెంలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఎంపికైన బతుకమ్మలు పేర్చిన మహిళలకు రోజుకొకరికి పట్టుచీర గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. తద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని రకాలుగా ప్రజల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

గత ప్రభుత్వంలో కింగ్…
గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖలో ప్రజారోగ్య సంచాలకులుగా చక్రం తిప్పిన డాక్టర్ శ్రీనివాసరావు… కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆయన్ని తప్పించిన విషయం తెలిసిందే. పైగా ఆయన్ను డెమోషన్ చేసి అత్యంత చిన్న స్థాయి పోస్ట్ ఇవ్వడంతో అవమానభారంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. పైగా ఆయనపై అనేక అక్రమాలు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటమే బెటర్ అని ఆయన భావించి వైదొలిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. కోట్లకు పడగలెత్తిన గడల శ్రీనివాసరావు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లకు మొక్కినా గడలకు సీటు లభించలేదు.

కరోనాతో లక్ష్మీ కటాక్షం…
గడల శ్రీనివాసరావు… తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులుగా ఉన్న కాలంలో మొత్తం వ్యవస్థను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆ విభాగాన్ని గడల సామంత రాజ్యం (జీఎస్ఆర్)గా మలుచుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అండ చూసుకొని మరీ పెచ్చుమీరిపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన ఒక సెలబ్రిటీగా మారిపోయారు. కరోనా కాలంలో ఆయనకు లక్ష్మీ కటాక్షం వరించినట్టు చెప్తారు. విచిత్రం ఏంటంటే డీఎంహెచ్ఓ స్థాయి కూడా లేని గడలను డీహెచ్ గా పెట్టడమే అసలైన ట్విస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆయనను మహబూబాబాద్ జిల్లాకు డీఎంహెచ్ఓ తర్వాత స్థాయి పోస్టుకి బదిలీ చేశారు.

రాజకీయాలపైనే ఫోకస్ పెట్టి…
తన పేరు తన తండ్రి పేరు ప్రతిబింబించేలా జీఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. 2023 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేయాలని ఆయన ప్లాన్ చేశారు. అందుకోసం కరోనా కాలం నుంచే ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ట్రస్ట్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి జాబ్ మేళ, వైద్య శిబిరాలు నిర్వహించారు. స్థానిక అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే ఏకంగా రాజకీయ విమర్శలు చేశారు. ఒక అధికారిగా రాజకీయ విమర్శలు చేయడంపై వివాదాలు తలెత్తినా పట్టించుకోలేదు. నాటి ముఖ్యమంత్రి అండదండలు చూసుకుని చెలరేగిపోయారు.

పునఃప్రవేశం వెనుక బీఆర్ఎస్?
హైదరాబాద్ కోఠిలోని డీహెచ్ కార్యాలయం ‘మినీ కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయ కేంద్రం’గా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. తన వద్ద అధికారులుగా పని చేసే కొందరిని కొత్తగూడెంలో నిర్వహించే పలు కార్యకమాలకు వాడుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. సీటు కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకోవడం తీవ్రమైన విమర్శలకు దారి తీసినా లెక్క చేయలేదు. చివరకు ఎన్నికల సమయంలో ఆయనకు బీఆర్ఎస్ టిక్కెట్ దక్కలేదు.

ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తనపై బీఆర్ఎస్ ముద్ర ఉందన్న భయంతో మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి ఆయన ఆశీర్వాదం పొందాలని చూశారు. ఆ పార్టీలో చేరుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఖమ్మం లోక్ సభ సీటుకు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు నటించడం ద్వారా ఇక్కడ తన పోస్టుకు డోకా లేకుండా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఇప్పుడు ఆయన పునఃప్రవేశం వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ ద్వారానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆయన వ్యూహంగా చెబుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *