- గేమ్ లో రూ.13 లక్షలు పోగొట్టాడు
- తండ్రికి తెలియకుండా గేమ్ ఆడాడు
- డిజిటల్ మాయలో పడి జీవితం బలి
సహనం వందే, లక్నో:
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆన్‌లైన్ గేమ్ 12 ఏళ్ల విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్రీ ఫైర్ గేమ్‌లో ఏకంగా రూ.13 లక్షలు పోగొట్టుకున్న ఆరో తరగతి విద్యార్థి యశ్ కుమార్… తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అతని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. మైనర్ పిల్లలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎలా పడిపోతున్నారో దీని ద్వారా మరోసారి రుజువైంది. ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌లు పిల్లలను ఆకర్షించి, డబ్బులు ఖర్చు చేయమని ప్రేరేపిస్తున్నాయని ఈ ఘటన తెలియజేస్తోంది.
బ్యాంక్ పాస్‌బుక్ చూసి తండ్రి షాక్…
యశ్ తండ్రి సురేష్ కుమార్ యాదవ్ ఒక పెయింటర్. రెండేళ్ల క్రితం తన భూమిని అమ్మి వచ్చిన రూ.13 లక్షలను యూనియన్ బ్యాంక్ బిజోర్ బ్రాంచ్‌లో డిపాజిట్ చేశాడు. ఇటీవలే తన పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయగా తన ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు కట్ అయినట్లు తెలిసి షాక్‌కు గురయ్యాడు. దర్యాప్తులో ఈ మొత్తం ఆన్‌లైన్ గేమింగ్ కోసం ఖర్చయినట్లు తేలింది. ఇంటికి వచ్చిన తర్వాత సురేష్ తన కుమారుడు యశ్‌ను అడగ్గా మొదట ఏమీ తెలియదని చెప్పినప్పటికీ, తర్వాత ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ డబ్బు పోగొట్టుకున్నానని అంగీకరించాడు.
మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య…
పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నా తండ్రి మందలించలేదు. కానీ తాను చేసిన తప్పుకు తీవ్ర మనస్తాపానికి గురైన యశ్… కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా తమ కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో యశ్ తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తల్లిదండ్రుల అప్రమత్తత అవసరం…
ఈ విషాద ఘటన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచడం, వారికి సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం తప్పనిసరి. ఆన్‌లైన్ గేమ్‌ల పట్ల పిల్లలు ఆకర్షితులై, వాటికి బానిసలయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం, పోలీసులు కూడా సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.