పేదల వైద్యంపై పిడుగు – ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్

  • తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ప్రజలకు చుక్కలే
  • వేల కోట్ల బకాయిలు పెండింగే కారణం
  • ఆస్పత్రుల నిర్ణయంపై స్పందించని సర్కార్లు
  • సీజనల్ వ్యాధుల సమయంలో క్లిష్ట పరిస్థితి

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:
తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్ పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2500 కోట్లు, తెలంగాణలో రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవలను నిలిపివేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్టీఆర్ పథకం కింద ఉన్న ఓపీడీ సేవలు నిలిచిపోనున్నాయి.

ప్రభుత్వ నిర్లక్ష్యం… పేదలకు శాపం
ప్రైవేటు ఆస్పత్రులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస స్పందన చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆస్పత్రుల సంఘం (ఆశా) ప్రభుత్వానికి లేఖలు రాసి బకాయిలు విడుదల చేయాలని కోరింది. తెలంగాణలో తాన్హా అధ్యక్షుడు వద్దిరాజు రాకేష్ కూడా గత 20 రోజుల్లో జరిగిన సమావేశాల్లో ఎలాంటి పురోగతి లేదని వాపోయారు. 22 నెలలుగా ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా చెల్లింపులు చేయకపోవడం వల్ల ఆస్పత్రులు సేవలు నిలిపివేయడం తప్ప మార్గం లేదని చెబుతున్నాయి.

పేదలపై భారం…
ఈ సేవల నిలిపివేతతో అత్యంత నష్టపోయేది పేదలే. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలు పేద కుటుంబాలకు ఉచిత చికిత్స అందించేందుకు రూపొందాయి. కానీ ఇప్పుడు ఈ సేవలు బంద్ కావడంతో రోగులు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికే రద్దీగా ఉన్న ఆస్పత్రులు ఈ అదనపు భారాన్ని భరించలేవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంలో 2025 జనవరిలో జరిగిన సమ్మె సమయంలో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని తాన్హా ఆందోళన వ్యక్తం చేసింది. కీలకమైన వ్యాధుల సీజన్లో ఈ వైద్య సేవలు నిలిచిపోతే పేదలకు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ హామీలు కేవలం మాటలేనా?
గతంలో బకాయిల సమస్యపై ఆస్పత్రులు సమ్మె చేసినప్పుడు ప్రభుత్వాలు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చాయి. గత జనవరిలో తెలంగాణలో బకాయిలపై సమ్మె జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించినట్లు కనిపించింది. కానీ ఏడెనిమిది నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆస్పత్రులు చికిత్స ప్యాకేజీ రేట్లను సవరించాలని, చెల్లింపులకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మౌనం వహించడం ద్వారా పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాయని ఆస్పత్రుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *