హుస్సేన్‌సాగర్ నీటిపై క్రికెట్ స్టేడియం

  • తేలియాడే మైదానంలో క్రికెట్, ఫుట్‌ బాల్
  • జలక్రీడలతో ట్యాంక్ బండ్ కు కొత్త కళ..!
  • భాగ్య నగరవాసులకు కొత్త అనుభవం
  • సింగపూర్ తరహా పర్యాటకానికి ఏర్పాట్లు

సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి మరిన్ని కొత్త హంగులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్సేన్‌సాగర్‌ నీటిపై ఫ్లోటింగ్ గ్రౌండ్స్ (తేలియాడే మైదానాలు) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీంతో పర్యాటక రంగం మరింత పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ వాసులు నీటిపైనే ఫుట్‌బాల్, బాక్స్ క్రికెట్ వంటి క్రీడలు ఆడుకునే అరుదైన అవకాశం దక్కుతుంది. ఇప్పటివరకు ఇలాంటివి సింగపూర్ వంటి విదేశాల్లోనే చూసిన మనం… ఇకపై వాటిని మన నగరంలోనూ చూడొచ్చు. హుస్సేన్‌సాగర్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు…
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ఇప్పటికే పలు ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్వాల్‌గూడలో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ. 225 కోట్ల వ్యయంతో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును డిసెంబర్ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ పర్యాటక అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

నగరంలో స్కైవాక్‌ వంతెన…
హుస్సేన్‌సాగర్‌ అభివృద్ధిలో భాగంగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ను కలుపుతూ నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్కు, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, ప్రసాద్ ఐమాక్స్ వరకు 10.5 కిలోమీటర్ల పొడవుతో స్కైవాక్ వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. దీనివల్ల పర్యాటకులు నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులువుగా చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్‌లో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *