- ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఘనత
- ప్రశ్నలు… హాజరు విభాగాల్లో మొదటి స్థానం
సహనం వందే, న్యూఢిల్లీ:
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటులో టాపర్ గా నిలిచారు. ప్రశ్నలు, హాజరు విభాగాల్లో ఎంపీలందరితో పోలిస్తే మొదటి స్థానం సాధించారు. మొత్తం పని తీరులో నాలుగో స్థానం వచ్చింది. 99 శాతం హాజరు, 115 ప్రశ్నలతో ముందుండటం అతని అంకితభావాన్ని తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీలలో అత్యుత్తములలో ఒకరిగా నిలవడం తెలుగుదేశం పార్టీకి గొప్ప గుర్తింపు. లోక్‌సభ సభ్యుల పనితీరు నివేదికను పార్లమెంట్ విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4 వరకు సభ్యుల చర్చలు, అడిగిన ప్రశ్నలు, హాజరు ఆధారంగా ఈ జాబితా తయారైంది. అప్పలనాయుడు ప్రశ్నలు, హాజరు విభాగాల్లో మొదటి స్థానం సాధించారు.
ప్రధాని ప్రశంస…
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ర్యాంకింగ్ సందర్భంగా అప్పలనాయుడిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆగస్టు 11న పార్లమెంట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో మోదీ మాటలు టీడీపీ అలయన్స్ బలాన్ని మరింత బలపరిచాయి. విజయనగరం ఎంపీ ప్రశ్నల ద్వారా రైల్వే, విమానయాన శాఖల్లో ఆంధ్ర అభివృద్ధికి చేసిన కృషి ప్రధాని దృష్టికి తీసుకువచ్చింది. ఈ ప్రశంస ఎన్‌డీఏలో టీడీపీ పాత్రను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సాయాలు పెరిగే అవకాశాన్ని సృష్టిస్తోంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీకి ఇది రాజకీయ ప్రయోజనం చేకూర్చనుంది.

సైకిల్ పై పార్లమెంటుకు వెళ్తూ సంచలనం…
పార్లమెంట్ తొలి రోజు నుంచి సైకిల్‌పై చేరుకుని అందరి దృష్టి ఆకర్షించిన అప్పలనాయుడు… తొలి నెల జీతాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇచ్చారు. మార్చిలో మహిళా దినోత్సవంలో మూడోసారి ఆడపిల్లకు జన్మిస్తే రూ. 50 వేలు డిపాజిట్ చేస్తానని ప్రకటించి సామాజిక బాధ్యతను చూపారు. ఆగస్టులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌తో కలిసి విజయనగరం రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఈ చర్యలు టీడీపీ ఎంపీల సర్వీస్ మైండ్‌ను తెలియజేస్తున్నాయి. పార్టీ ఇమేజ్‌ను మెరుగుపరుస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో అభివృద్ధి అలలు…
ఈ ర్యాంకింగ్ విజయనగరం జిల్లా అభివృద్ధికి మరింత ఉపయోగపడనుంది. ప్రశ్నల ద్వారా తన నియోజకవర్గ సంబంధిత సమస్యలు ఎత్తి చూపి కేంద్ర నిధులు ఆకర్షించే అవకాశం పెరిగింది. ఇటీవల అనంతపురం పర్యటనలో చంద్రబాబు విజన్ ప్రాజెక్టులను పరిశీలించి, తన భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించారు. ఈ పనితీరు రాజకీయ ప్రత్యర్ధులకు సవాలుగా మారుతూ, 2029 ఎన్నికలకు టీడీపీకి బలమైన పునాది వేస్తోంది. అప్పలనాయుడు ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.