- కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిరసన సెగ
- సేవాలాల్ సేన నేత సంజీవ్ నాయక్ ఉద్యమం
సహనం వందే, కొత్తగూడెం:
కొత్తగూడెం పట్టణం లంబాడీల ఆత్మగౌరవ నినాదాలతో హోరెత్తిపోయింది. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ… రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన కేసు విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఒకవైపు ఆదివాసీలతో, మరోవైపు లంబాడీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించడం సమస్యను పరిష్కరించడానికి కాదని, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచడానికేనని సంజీవ్ నాయక్ ఆరోపించారు. సమస్యను మరింత జఠిలం చేసి లంబాడీలు, ఆదివాసీలు రోడ్ల మీద కొట్టుకునేలా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొంగులేటి ప్రమేయం?
సంజీవ్ నాయక్ ఆరోపణలు కేవలం ప్రభుత్వానికే పరిమితం కాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాపూరావు వంటి వారిని ముఖ్యమంత్రి పిలిచి కేసును ఉపసంహరించుకునేలా చేయవచ్చని, కానీ ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు. ఇది సమస్యను కావాలనే పెద్దది చేస్తున్నారని అనడానికి నిదర్శనమని అన్నారు. తెల్లం వెంకట్రావు తన ప్రధాన అనుచరుడు కావడంతో ఈ వివాదం వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్ధమైన హక్కుల రక్షణ…
లంబాడీలు అక్రమంగా గిరిజన జాబితాలో చేరారని కొందరు చేస్తున్న ఆరోపణలను లంబాడీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. లంబాడీలు రాజ్యాంగబద్ధంగానే గిరిజన జాబితాలో చేరారని, ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడటానికి సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే ఆత్మగౌరవ పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటామని, ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ హుస్సేన్ నాయక్, జాక్ నాయకులు వీరు నాయక్, ఎల్.హెచ్.పి.ఎస్. రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్, డాక్టర్ శంకర్ నాయక్ సహా పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.