- ‘మా దేశం మాక్కావాలి’.. బ్రిటన్ లో నిరసనలు
- వలస వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన బ్రిటన్
- పోరాడండి లేదా చనిపోండని మస్క్ ఆజ్యం
- బ్రిటన్ విధ్వంసం అంచున ఉందని హెచ్చరిక
- ఆ దేశంలో పాలన మార్పు జరగాలని పిలుపు
సహనం వందే, లండన్:
లండన్ నగరం వలస వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది. యాంటీ-ఇమ్మిగ్రేషన్ ఉద్యమం గట్టి గళంతో ముందుకు సాగుతోంది. వెస్ట్‌మిన్‌స్టర్ బ్రిడ్జి నుంచి హౌస్ ఆఫ్ పార్లమెంట్ వరకు వేలాది మంది ప్రజలు కదలివచ్చారు. అతివాద కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ఈ ‘యునైట్ ది కింగ్‌డమ్’ ర్యాలీకి లక్షన్నర మందికి పైగా హాజరయ్యారని నివేదికలు చెబుతున్నాయి. వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ, అక్రమ వలసదారులను వెంటనే వెనక్కి పంపించాలని వీరు డిమాండ్ చేశారు. నిరసన శాంతియుతంగా మొదలైనా చివరికి హింసకు దారితీసింది. ఆందోళనకారులు పోలీసులుపై దాడికి దిగారు. బాటిళ్లు, ఇతర వస్తువులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనల్లో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది బ్రిటన్‌లో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది.

ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు…
ఈ నిరసనలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వర్చువల్‌గా మద్దతు పలికి సంచలనం సృష్టించారు. వలస వ్యతిరేక ర్యాలీలో మాట్లాడుతూ, బ్రిటన్ విధ్వంసం అంచున ఉందని హెచ్చరించారు. ‘తిరిగి పోరాడటం లేదా చనిపోవడం’ అనే రెండే మార్గాలు ఉన్నాయని నిరసనకారులను రెచ్చగొట్టారు. బ్రిటన్ నెమ్మదిగా నాశనమవుతోందని, భారీ వలసలతో ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతోందని ఆరోపించారు. మస్క్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. బ్రిటన్‌లో పాలన మార్పు జరగాలని, పార్లమెంటును రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఒక అంతర్జాతీయ వ్యాపారవేత్త బ్రిటన్ అంతర్గత రాజకీయాల్లో నేరుగా జోక్యం చేసుకోవడంపై చర్చకు దారితీసింది.
రాబిన్సన్ ఉద్వేగపూరిత ప్రసంగం…
ర్యాలీకి నాయకత్వం వహించిన టామీ రాబిన్సన్ తన ప్రసంగంలో రాజకీయ నాయకులను, న్యాయవ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. బ్రిటన్ కోర్టులు అక్రమ వలసదారులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, ఇది స్థానికుల హక్కులకు నష్టం కలిగిస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది జైలు నుంచి విడుదలైన రాబిన్సన్… భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తానని ప్రకటించడం ఆయన దూకుడు రాజకీయాలను స్పష్టం చేస్తుంది. వలస వ్యతిరేక ఆందోళనలు బ్రిటన్ రాజకీయాలలో ఒక బలమైన శక్తిగా మారుతున్నాయని, భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.