- నైట్‌క్లబ్.. డీజే సౌండ్… ఈవెంట్ ఆర్గనైజర్
- సాధారణ డిగ్రీ చేసిన 36 ఏళ్ల యువకుడు
- ఒక్కసారిగా దేశ రాజకీయ యవనికపై స్పార్క్
సహనం వందే, నేపాల్:
నేపాల్‌లో అవినీతి, కుటుంబ రాజకీయాలు… అలాగే సోషల్ మీడియా నిషేధంపై జెన్ జెడ్ యువతలో రేగిన ఆగ్రహం ఇప్పుడు రాజకీయ విప్లవంగా మారింది. ఈ పోరాటంలో ప్రభుత్వాన్ని గడగడలాడించిన యువ కెరటం 36 ఏళ్ల సుదాన్ గురుంగ్. ‘హమి నేపాల్’ అనే సంస్థకు అధ్యక్షుడైన గురుంగ్… ఈ నిరసనలకు ఊపిరి పోశాడు. వాటిని దేశవ్యాప్తంగా వ్యాపింపజేశాడు. ‘కొత్త తరం ముందుకు వచ్చి, పాత విధానాలను సవాల్ చేయాల’ని గురుంగ్ చెప్పిన మాటలు లక్షలాది మంది యువతను కదిలించాయి. ఒక సాధారణ యువకుడు దేశ రాజకీయ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పాడో చూద్దాం.

డీజే నుంచి డిజాస్టర్ రిలీఫ్ వరకు…
సుదాన్ గురుంగ్ 1989లో నేపాల్‌లో జన్మించాడు. సాధారణ డిగ్రీ మాత్రమే చదివాడు. చిన్నప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్, డీజేగా పని చేస్తూ వినోద ప్రపంచంలో మునిగి పోయాడు. నైట్‌క్లబ్‌లు నడిపి పార్టీలు నిర్వహించేవాడు. కానీ 2015లో వచ్చిన పెను భూకంపం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ విపత్తులో తన చిన్న పిల్లను కోల్పోయాడు. ‘నా కళ్ల ముందే నా బిడ్డ చనిపోయింది. ఆ క్షణం నా జీవితాన్ని మార్చేసింద’ని ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ దుఃఖం అతడిని సేవా మార్గంలో నడిపించింది. ఈవెంట్ ప్లానర్ నుంచి డిజాస్టర్ రిలీఫ్ ఆర్గనైజర్‌గా మారి వేలాది మందికి సాయం చేశాడు. ఈ అనుభవం అతడిని ఒక ఫిలాంత్రపిస్ట్, యాక్టివిస్ట్‌గా మార్చింది.
హమి నేపాల్… విప్లవానికి వేదిక
2015 భూకంపం తర్వాత సుదాన్ గురుంగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా దానికి స్పందించి 200 మంది వాలంటీర్లు సహాయక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తితో 2015లోనే ‘హమి నేపాల్’ (మేము నేపాల్) అనే సంస్థను స్థాపించాడు. మొదట ఈ సంస్థ విపత్తు సహాయక, పునరావాస కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. క్రమంగా అది యువతకు సాధికారత కల్పించే, పౌర కార్యకలాపాలను ప్రోత్సహించే సంస్థగా ఎదిగింది. ప్రముఖ డాక్టర్లు, మిస్ యూనివర్స్ నేపాల్ వంటి వ్యక్తులు ఈ సంస్థకు మద్దతు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్, డిస్కార్డ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ఈ సంస్థ యువతను ఏకం చేసి ఈ విప్లవానికి వేదికగా మారింది.
పాత విధానాలకు సవాల్…
సుదాన్ గురుంగ్ నాయకత్వం ఈ తరం డిజిటల్ ప్రపంచానికి తగ్గట్టుగా ఉంది. సోషల్ మీడియా బ్యాన్ సమయంలో వీపీఎన్, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించి యువతను సమన్వయం చేసుకున్నాడు. నిరసనల్లో విద్యార్థులు స్కూల్ యూనిఫామ్‌లు వేసుకుని పుస్తకాలు పట్టుకుని ర్యాలీలు చేయమని సూచించాడు. ఇది అహింసా మార్గంలో నిరసన తెలియజేయడానికి ఒక చిహ్నంగా నిలిచింది. హమి నేపాల్ నిరసన ప్రదేశాలలో ఫస్ట్-ఎయిడ్ క్యాంపులు ఏర్పాటు చేసి గాయపడినవారికి సహాయం చేసింది. ‘ఇది నాయకత్వం కాదు… కలిసి పోరాడటం’ అనే సందేశాన్ని ఇచ్చాడు. #అన్‌బ్యాన్‌సోషల్‌మీడియా, #నెపోకిడ్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను వైరల్ చేసి యువతను ఆన్‌లైన్ నుంచి వీధుల్లోకి తీసుకురావడంలో విజయం సాధించాడు. అతను రాజకీయాల్లోకి వస్తాడా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక సాధారణ యువకుడు నేపాల్ రాజకీయాల్లో హీరో అయ్యాడు. ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. అతని పోరాటం, త్యాగం నేపాల్ యువతకు ఒక గొప్ప స్ఫూర్తిని ఇచ్చింది. ఈ విప్లవం యువత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది.