లోకల్ ఫుడ్సే… సూపర్‌ఫుడ్స్ – స్థానిక పండ్లు… కూరగాయలే ఆరోగ్యానికి రక్ష

  • విదేశీ పండ్లు… ఆహారాలతో జీరో యూజ్
  • వాటిల్లో మ్యాజిక్ చేసే మాయలేమీ లేవు
  • డిటాక్స్ ఒక మిథ్య… కేవలం ప్రచార అర్బాటం
  • ఇవేవీ వృద్ధాప్యాన్ని రివర్స్ చేయలేవు…

సహనం వందే, హైదరాబాద్:
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మెరుస్తున్న అకై బౌల్స్… కెఫెల్లో కనిపించే స్పిరులినా స్మూతీలు… వీటిని చూసి సూపర్‌ఫుడ్స్ అనే పదానికి అలవాటు పడిపోయాం. ఈ ఆహారాలు బరువు తగ్గించడంతో పాటు చర్మాన్ని మెరుగుపరుస్తాయని… శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయని… క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నిరోధిస్తాయని ప్రచారం జరుగుతోంది. కానీ వైద్యులు మాత్రం ఇవి మ్యాజిక్ చేసే మందులు కాదని… బ్యాలెన్స్‌డ్‌గా స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినడమే నిజమైన ఆరోగ్య రహస్యం అని స్పష్టం చేస్తున్నారు.

మాయా మందు కాదు…
గోల్డెన్ మిల్క్, బ్లూబెర్రీలు, అవిసె గింజలు వంటివి క్యాన్సర్ లేదా మధుమేహం వంటి వ్యాధులను పూర్తిగా నిరోధిస్తాయన్న ప్రచారం అపోహ మాత్రమే. ఏ ఒక్క ఆహారం కూడా వ్యాధులను నయం చేయదని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. బెంగళూరు అపోలో వన్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ గణవి కేబీ ప్రకారం… ఈ ఆహారాలు విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి కానీ వైద్య చికిత్సకు లేదా సమతుల్య ఆహారానికి ఇవి ప్రత్యామ్నాయం కావు. గురుగ్రామ్ సి.కె. బిర్లా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ తుషార్ తయాల్ వివరిస్తూ.‌‌.. క్యాన్సర్, మధుమేహం వంటివి జన్యు, జీవనశైలి కారణాల వల్ల వస్తాయని… కేవలం కొన్ని బెర్రీలు తినకపోవడం వల్ల కాదు అని స్పష్టం చేశారు. మన దేశంలో లభించే ఉసిరి, పసుపు వంటి స్థానిక ఆహారాలు విదేశీ సూపర్‌ఫుడ్స్ కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయని ఆయన తెలిపారు.

స్థానిక ఆహారాలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష…
విదేశాల నుంచి వచ్చే అకై, గోజీ బెర్రీలు వంటివి మన దేశంలో దొరికే పండ్ల కంటే మెరుగైనవన్నది ఒక అపోహ. మన దేశంలో ఆయా సీజన్లలో లభించే పండ్లు అంతకంటే ఎక్కువ పోషకాలను అందిస్తాయని… అంతేకాకుండా అవి చవకగా కూడా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ గణవి ప్రకారం జామ, ఉసిరి వంటి పండ్లలో గోజీ బెర్రీల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇవి తాజాగా ఉంటాయి. ఉసిరిలో యాంటీఆక్సిడెంట్ స్కోర్ బ్లూబెర్రీల కంటే 28 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే జామపండు రోజువారీ అవసరమైన విటమిన్ సీని 200 శాతం వరకు అందిస్తుంది.

డిటాక్స్ ఒక మిథ్య…
నిమ్మరసం, స్పిరులినా, ఆపిల్ సైడర్ వెనిగర్ వంటివి బరువు తగ్గించి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయని చెబుతారు. కానీ డాక్టర్ తయాల్ ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు. మన శరీరంలో కాలేయం, మూత్రపిండాలు సహజంగానే వ్యర్థాలను బయటకు పంపే పనిని చేస్తాయని… వాటికి అదనంగా డిటాక్స్ చేయడం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. బరువు తగ్గడం అనేది కేలరీల నియంత్రణ, వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. చియా గింజల నీరు లేదా గ్రీన్ జ్యూస్ వంటివి మాయలు కావు.

వృద్ధాప్యాన్ని రివర్స్ చేయలేవు…
రెడ్ గ్రేప్స్, కొల్లాజెన్ పౌడర్లు, గ్రీన్ టీ వంటివి వృద్ధాప్యాన్ని తిప్పికొడతాయని చెబుతారు. డాక్టర్ గణవి ప్రకారం… యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారాలు కణాల నష్టాన్ని నెమ్మదిస్తాయి కానీ వృద్ధాప్యాన్ని మాత్రం రివర్స్ చేయలేవు. వ్యాయామం, సరైన నిద్ర, ధూమపానం మానేయడం వంటివి మరింత ముఖ్యమైనవి. పసుపులో ఉండే కుర్కుమిన్ యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి, కీళ్ల ఆరోగ్యానికి మంచిది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన పౌడర్లు కాకుండా మన చుట్టూ ఉన్న స్థానిక పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, తృణధాన్యాలు మీ ప్లేట్‌లో ఉంటే,అదే నిజమైన ‘సూపర్ డైట్’.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *