ఎంఎన్ జేలో ఏం జరుగుతుంది? – డైరెక్టర్ తొలగింపుపై సీఎస్ ఆదేశాలు బేఖాతర్

  • వారం క్రితమే ఆదేశాలొచ్చినా విధుల్లో డైరెక్టర్
  • ఆయన్ని కాపాడుతున్నది ఎవరు?

సహనం వందే, హైదరాబాద్:
ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రికి ప్రభుత్వ ఆదేశాలు పట్టవా? ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఆదేశాలనే తుంగలో తొక్కుతున్నారు. వారం క్రితమే ఆయన ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి యంత్రాంగం ఆయనను ఎందుకు రిలీవ్ చేయడం లేదని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఆయనను కాపాడుతున్నది ఎవరని ఆసుపత్రి ఉద్యోగులు ఆరా తీస్తున్నారు.

గత నెల 26వ తేదీన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు

డీవోపీటీ వేటు వేసినా…
డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయనను తిరిగి వెనక్కి పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన విభాగం గత నెల తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ శ్రీనివాసులు చేసిన అభ్యర్థనను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వశాఖ (డీవోపీటీ) తిరస్కరించిన విషయమూ విదితమే. 2017 జనవరి 17న జారీ చేసిన ఆ ఉత్తర్వులు సరైనవని డీవోపీటీ తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణలో కొనసాగాలన్న ఆయన ఆశలకు బ్రేక్ పడింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిలీవ్ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. అయినప్పటికీ డాక్టర్ శ్రీనివాసులు డైరెక్టర్ కుర్చీని పట్టుకుని వేలాడుతున్నారని డాక్టర్లు మండిపడుతున్నారు. సెక్రటేరియట్ వర్గాలు మాత్రం ఆర్డర్స్ తయారవుతున్నాయని చెపుతున్నారట. ఇంత ఆలస్యానికి కారణం ఏంటనేది అంత చిక్కడం లేదు.

Share

One thought on “ఎంఎన్ జేలో ఏం జరుగుతుంది? – డైరెక్టర్ తొలగింపుపై సీఎస్ ఆదేశాలు బేఖాతర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *