- అభ్యర్థుల గుండెల్లో గునపాలు
- నిరుద్యోగుల ఆశలు కలలపై నీళ్లు
- టీజీపీఎస్సీ నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది
సహనం వందే, హైదరాబాద్:
మూడున్నరేళ్ల నిరీక్షణ… నిద్రాహారాలు లేని కఠోర శ్రమ… అసంఖ్యాకమైన ఆశల పతాక. వీటన్నింటికీ ప్రతిఫలంగా తుది జాబితాలో తమ పేర్లు చూసుకుని మురిసిపోయారు గ్రూప్-1 అభ్యర్థులు. నియామక పత్రాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వారి ఆశలపై పిడుగుపాటులా పడింది. తుది జాబితాను రద్దు చేస్తూ మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించడం... లేదంటే మళ్ళీ పరీక్షలు పెట్టాలని సూచించడం… ఈ తీర్పుతో వారి గుండె ఝల్లుమంది. ఈ ఆందోళనలో కన్నీటిలో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

అడగడుగునా అపశకునం…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 503 గ్రూప్-1 ఉద్యోగాలకు 2022లో నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కఠోర శ్రమ చేశారు. కొందరు తమ చిన్నపాటి ఉద్యోగాలను వదిలి, మరికొందరు సెలవులు పెట్టి మరీ సిద్ధమయ్యారు. కానీ వారి శ్రమకు తగిన ఫలితం లభించలేదు. మొదటిసారి జరిగిన పరీక్ష రద్దు, లీకేజీల వ్యవహారం, ఆ తర్వాత మళ్ళీ నిర్వహించిన పరీక్షపై వచ్చిన విమర్శలు… ఇలా అడుగడుగునా నిరాశే. ఒకవైపు టీజీపీఎస్సీ వైఫల్యాలు, మరోవైపు రాజకీయ మార్పులు.. ఈ మధ్యలో నలిగిపోయింది నిరుద్యోగుల జీవితం.
మళ్ళీ మొదటి నుంచా?
తాజా హైకోర్టు తీర్పుతో గ్రూప్-1 నియామక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఇప్పటికే ఈ ప్రక్రియపై మూడున్నరేళ్లు గడిచాయి. ఈ కాలంలో అభ్యర్థులు పడిన శ్రమ, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి అపారం. ఇప్పుడు మళ్ళీ మూల్యాంకనం, అవసరమైతే తిరిగి పరీక్షలు అనడంతో వారు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఇప్పుడున్న మార్కులకు హామీ లేదు. రీవాల్యూయేషన్‌లో మళ్లీ అర్హత సాధిస్తారో లేదో తెలియని పరిస్థితి. మళ్లీ పరీక్షలు జరిగితే అన్నింటినీ మళ్లీ మొదలు పెట్టాలి. ఈ అనిశ్చితి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది.
నిరుద్యోగుల ఆక్రందన…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యం, నిబంధనలను పాటించకపోవడం వల్ల ఇప్పుడు ఈ దుస్థితి దాపురించింది. సరైన విధానాలు, పారదర్శకత లోపించడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు తమ జీవితాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకునేంతగా టీజీపీఎస్సీ వ్యవస్థ బలహీనపడింది. అధికారులు ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఇప్పుడు టీజీపీఎస్సీ ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తుందా లేక కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తుందా అన్నది తెలియదు. ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభ్యర్థులు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.
బాధాకరమైన భవితవ్యం…
ఒక యువకుడు తన కలలను సాకారం చేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తపిస్తాడు. దాని కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తాడు. కానీ వ్యవస్థలోని లోపాల వల్ల ఆ కలలు కల్లలవుతున్నాయి. ఈ తీర్పుతో ఒక్క గ్రూప్-1 అభ్యర్థులే కాదు, మొత్తం నిరుద్యోగ లోకం నిరాశలో మునిగిపోయింది. ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలి. లేకపోతే నియామకాల కోసం మళ్లీ ఎంత కాలం వేచి చూడాలో, వారి జీవితాలు ఏమవుతాయో తెలియని అయోమయం కొనసాగుతూనే ఉంటుంది. నిరుద్యోగుల ఆశలపై పిడుగుపాటులా పడిన ఈ తీర్పు వ్యవస్థల వైఫల్యానికి ఒక నిలువుటద్దం.