- రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు మక్బూల్ ఆవేదన
- మూడు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి
సహనం వందే, ఖమ్మం:
తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, డైలీ వేజెస్ ఉద్యోగుల బతుకులు మూడు నెలలుగా అగమ్యగోచరంగా మారాయి. ప్రజాపాలనలో జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు షేక్ మక్బూల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. గత ప్రభుత్వం గురుకుల ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించిందని, ప్రతినెలా మొదటి వారంలోనే జీతాలు సక్రమంగా అందించేదని మక్బూల్ గుర్తు చేశారు. కుకింగ్ స్టాఫ్, సెక్యూరిటీ, ప్లంబర్ కమ్ ఎలక్ట్రీషియన్ వంటి ఉద్యోగులను గతంలో ఔట్‌సోర్సింగ్‌గా పరిగణించగా, ఇప్పుడు వారిని డైలీ వేజెస్ ఉద్యోగులుగా మార్చారని ఆయన ఆరోపించారు. ఈ చర్యలు ప్రజాపాలన నినాదానికి వ్యతిరేకమని, ఉద్యోగుల ఆకాంక్షలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
వెట్టిచాకిరీ చేస్తున్నారా?
గురుకులాల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఏడాది పొడవునా పన్నెండు నెలల జీతం ఇవ్వకుండా కేవలం ఏప్రిల్ నెల వరకే చెల్లిస్తూ ప్రభుత్వం వారిని వెట్టిచాకిరీ చేయిస్తోందని మక్బూల్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశం కాలేదని, వారి కష్టాలను పట్టించుకోలేదని ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆయన విమర్శించారు. ‘సమాన పనికి సమాన వేతనం’ అనే చట్టాలను ప్రభుత్వం గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
డిమాండ్ల అమలుకు పిలుపు
అరకొర జీతాలతో జీవనం వెళ్లదీస్తున్న గురుకుల ఉద్యోగులకు వెంటనే పెండింగ్ జీతాలను విడుదల చేయాలని, ఇకపై ప్రతినెలా మొదటి వారంలో జీతాలు సక్రమంగా అందజేయాలని షేక్ మక్బూల్ కోరారు. అలాగే జీతాలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పెంచాలని, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ళలో ప్రత్యేక కోటాను అమలుచేసి ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.