కోచింగ్‌కు పన్ను… భవిష్యత్తుపై మన్ను – విద్యార్థుల జీవితాలతో 18% జీఎస్టీ ఆట

  • ఇలాగైతే డాక్టర్, ఐఐటీ ఆశలకు గండి
  • ఆన్ లైన్ ట్యూషన్లకు కూడా జీఎస్టీ వర్తింపు
  • మధ్య, దిగవ తరగతి ప్రజలపై పిడుగు
  • ప్రతి ముగ్గురిలో ఒకరు కోచింగ్ కి వెళ్తున్నారు
  • వారందరి కుటుంబాలపై జీఎస్టీ పెంపు భారం

సహనం వందే, హైదరాబాద్:
మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడొక కొత్త చిక్కు వచ్చి పడింది. ఒకవైపు పిల్లల భవిష్యత్తు, మరోవైపు పెరిగిపోయిన ఖర్చులు. ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ కోచింగ్‌ సెంటర్లకు, ఆన్‌లైన్ ట్యూషన్లకు 18 శాతం జీఎస్టీ విధించడంతో ఈ సంకట పరిస్థితి మరింత పెరిగింది. పాఠశాలలు, కళాశాలలు పన్ను పరిధి నుంచి మినహాయించిన ప్రభుత్వం… కోచింగ్ సంస్థలను విద్యాసంస్థలుగా పరిగణించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను భారం వల్ల తల్లిదండ్రులు కోచింగ్ మానిపించి, పిల్లలను మళ్లీ పాఠశాల విద్యపై దృష్టి పెట్టేలా చేయడం. కానీ ఈ చర్య నిజంగానే కోచింగ్ వెళ్లే పరిస్థితులను తగ్గిస్తుందా? లేక కుటుంబాల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుందా? వీటి సంగతి ఏమో కానీ డాక్టర్, ఐఐటీ కావాలనుకున్న మధ్య తరగతి పిల్లల ఆశలపై పిడుగు పడినట్లు అయింది.

కోచింగ్ సంస్కృతి ఎందుకు పెరిగింది?
కోచింగ్ అనేది ఇప్పుడు కేవలం అదనపు అవసరం కాదు, అది ఒక తప్పనిసరి వ్యయంగా మారిపోయింది. 1990ల నుంచి స్థానిక ట్యూషన్లతో మొదలైన ఈ ధోరణి, ఇప్పుడు లక్షల కోట్ల పరిశ్రమగా ఎదిగింది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. విద్యార్థులపై పెరుగుతున్న పోటీ, ముఖ్యంగా జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షల కఠినత్వం, పాఠశాలల బోధనపై తల్లిదండ్రులకున్న అపనమ్మకం వంటివి ఈ కోచింగ్ సంస్కృతికి ప్రధాన కారణాలు. ఇన్‌ఫినియం గ్లోబల్ రీసెర్చ్ ప్రకారం… ప్రస్తుతం రూ. 58 వేల కోట్ల విలువైన ఈ రంగం 2028 నాటికి రూ.1.34 లక్షల కోట్లకు చేరుతుందంటే దాని పెరుగుదల ఎంత ఉధృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గ్రామీణ, పట్టణ వ్యత్యాసాలు…
సీఎంఎస్ ఎడ్యుకేషన్ సర్వే ప్రకారం… దేశంలోని ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు కోచింగ్‌కు వెళ్తున్నారు. పట్టణాల్లో ఈ సంఖ్య 30.7 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 25.5 శాతంగా ఉంది. ఖర్చుల విషయంలో ఈ తేడాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. పట్టణాల్లో సగటున ఒక విద్యార్థికి ఏటా రూ.3,988 ఖర్చు చేస్తే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,793 మాత్రమే అవుతోంది. విద్యా స్థాయి పెరిగే కొద్దీ ఈ ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతోంది. ఉన్నత పాఠశాల స్థాయిలో రూ.4,183, ఉన్నత మాధ్యమిక స్థాయిలో రూ.6,384 వరకు ఖర్చు అవుతోంది. ఈ గణాంకాలు చూస్తే, మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం ఎంత అధికంగా పడుతుందో అర్థమవుతుంది.

కోచింగ్‌ను ఎందుకు వదులుకోలేకపోతున్నారు?
తల్లిదండ్రులు తమ పిల్లలను కోచింగ్‌కు పంపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, పోటీలో వెనకబడిపోతామనే భయం వంటివి ఇందులో ముఖ్యమైనవి. ఇటువంటి పరిస్థితుల్లో 18 శాతం పన్ను అనేది పెద్ద భారాన్ని కలిగించినప్పటికీ, తల్లిదండ్రులు దీనిని పిల్లల భవిష్యత్తు కోసం చేసే ఒక అనివార్యమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే ఈ పన్ను భారం కోచింగ్ కు పంపించాలన్న ఆలోచనను తగ్గించడంలో అంతగా ప్రభావం చూపదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

అమలు కాని నిబంధనలు…
కోచింగ్ సంస్థల నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేసింది. విద్యార్థుల అడ్మిషన్లకు వయోపరిమితులు, ర్యాంకులకు హామీ ఇస్తూ చేసే తప్పుడు ప్రకటనలపై నిషేధం వంటి మార్గదర్శకాలను విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు కూడా తప్పుదారి పట్టించే ప్రకటనలపై నిబంధనలు జారీ చేశాయి. కానీ ఈ నియంత్రణ చర్యల అమలు మాత్రం చాలా బలహీనంగా ఉంది. కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల కోచింగ్ సంస్థలు యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి.

అసలు మార్పు కావాలి…
18 శాతం జీఎస్టీ ఒక్కటే కోచింగ్ సంస్కృతిని పూర్తిగా అదుపు చేయలేదు. ఎందుకంటే ఈ సమస్య కేవలం ఆర్థికమైనది కాదు. దీనికి కారణం పాఠశాల విద్య నాణ్యతలో ఉన్న బలహీనతే. పాఠశాలల్లో అదనపు రీమిడియల్ క్లాసులు, ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ, పాఠశాలల్లోనే ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేసే ఏర్పాట్లు వంటివి చేస్తేనే ఈ కోచింగ్ పిచ్చి తగ్గుతుంది. అంతేకాకుండా చాట్‌జిపిటి స్టడీ మోడ్ వంటి కృత్రిమ మేధస్సు ఆధారిత అభ్యాస సాధనాలు, ఉచిత ఆన్‌లైన్ ప్రాక్టీస్ యాప్‌లు వంటి డిజిటల్ వనరులను ప్రోత్సహించడం కూడా ఈ సమస్యకు ఒక సమర్థవంతమైన పరిష్కారం కావచ్చు. అప్పటివరకు పన్ను భారం ఉన్నప్పటికీ కోచింగ్ పంపించాలన్న ఆలోచన అలాగే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టడానికి సిద్ధంగా లేరు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *