- డిజిటల్ తరం ఉద్యమ స్ఫూర్తి
- పోలీస్ కాల్పుల్లో 19 మంది మృతి
- అట్టుడికి పోతున్న నేపాల్ దేశం
- ఆ దేశ హోంమంత్రి రాజీనామా
సహనం వందే, నేపాల్:
నేపాల్‌లో యువత చేపట్టిన నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. అవినీతి, సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా ‘జెన్-జెడ్’ యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడంతో ఈ ఉద్యమం మొదలైంది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంట్ సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడితో సహా 19 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ఖాట్మండులో కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపు చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దించారు.

నిరసనలతో అట్టుడుకుతున్న నేపాల్…
వేలాది మంది యువ నిరసనకారులు ఖాట్మండు వీధుల్లోకి వచ్చి పోలీసుల బారికేడ్లను ధ్వంసం చేస్తూ ముందుకు సాగారు. నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ప్రభుత్వం అత్యున్నత స్థాయి జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. నిరసనల ఉధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం సోషల్ మీడియా యాప్‌లపై నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం…
ఈనెల 4న ప్రభుత్వం ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలని తీసుకున్న నిర్ణయం యువతను ఆగ్రహానికి గురిచేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నియంత్రణ చర్యగా సమర్థించుకున్నప్పటికీ, యువత మాత్రం ఇది తమ స్వేచ్ఛను అణచివేసే సెన్సార్‌షిప్ అని ఆరోపిస్తున్నారు.
ఫోన్, ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ ఉన్నప్పటికీ జెనరేషన్ జెడ్ యువకులు టిక్‌టాక్, రెడ్డిట్ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఒక తాటిపైకి వచ్చారు. తమ పోరాటం సోషల్ మీడియా బ్యాన్‌కు మాత్రమే పరిమితం కాదని, ప్రభుత్వంలోని అవినీతికి వ్యతిరేకంగా అని వారు స్పష్టం చేస్తున్నారు.

ప్రధాని ఓలిపై పెరుగుతున్న ఒత్తిడి…
నేపాల్‌లో జరుగుతున్న ఈ నిరసనలు మొదట ఖాట్మండుకు పరిమితమైనప్పటికీ క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు పాకాయి. పోఖారాలో ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడి అనంతరం అక్కడి అధికారులు కర్ఫ్యూ విధించారు. ప్రధాని కేపీ శర్మ ఓలి సోషల్ మీడియా యాప్స్ నిషేధాన్ని సమర్థించుకుంటూ ‘దేశాన్ని బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నీ సహించం’ అని వ్యాఖ్యానించారు. అయితే పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, హింసాత్మక ఘటనలతో ప్రధానిపై ఒత్తిడి పెరుగుతోంది. యువత ఈ నిరసనలను కొనసాగిస్తే ప్రభుత్వంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.