వేటు కోసం వెయిట్ – బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల రగడ

  • 10 మంది అనర్హతపై బీజేపీ ఎదురుచూపు
  • ఉప ఎన్నికలు కోరుకుంటున్న కమలం పార్టీ
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ ఉచ్చు
  • వారితో అత్యవసరంగా సమావేశమైన సీఎం
  • రాజీనామాకే మొగ్గు చూపిన దానం నాగేందర్
  • బీఆర్ఎస్, బీజేపీ అంతర్గత పొత్తుకు ఛాన్స్

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం సంచలనం సృష్టించింది. ఈ ఫిరాయింపులపై వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరూ స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం తొమ్మిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సీఎం నివాసంలో రహస్య సమావేశం
హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహా మిగిలిన తొమ్మిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీకర్ నోటీసులు, రాజీనామాలు, రాబోయే ఉప ఎన్నికల వ్యూహంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌తో పాటు ఖైరతాబాద్‌నూ గెలిపిస్తానని ఆయన అధిష్ఠానం ముందు ప్రతిపాదించినట్లు సమాచారం.

ఎమ్మెల్యేల సమాధానాల్లో ట్విస్ట్
స్పీకర్ నోటీసులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమాధానాలు పంపారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిశామని వారు స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. అనర్హత వేటు వేసేందుకు ఆధారాలు లేవని వారు వాదించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కూడా తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని మీడియాలో ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో గాంధీకి మూడు రోజులపాటు వాగ్వాదం జరిగింది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి సమాధానాలే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ ఒత్తిడి… బీజేపీ ఎదురుచూపు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశం ఎలా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇటు బీజేపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దైతే ఉప ఎన్నికలు తప్పవు. రాష్ట్రంలో యూరియా కొరత, ప్రభుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో బీజేపీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ సంక్షోభంలో ఉండటం వల్ల అధికార, ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో సీట్లు గెలిస్తే రాబోయే ఎన్నికల్లో తామే ప్రభుత్వానికి ప్రత్యామ్నాయమని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారు. అవసరమైతే బీఆర్ఎస్, బీజేపీ అంతర్గత పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్పీకర్ నిర్ణయంపై సస్పెన్స్
స్పీకర్ నోటీసులకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చే సమాధానాలు, స్పీకర్ దానిపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. స్పీకర్ సుప్రీంకోర్టుకు ఇవ్వబోయే వివరణపైనా అందరి దృష్టి నెలకొంది. గతంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక్క ఎమ్మెల్యేపైనా అనర్హత వేటు పడదని ప్రకటించడంపైనా సుప్రీంకోర్టు సీరియస్ గా ఉందని సమాచారం. ఈ పరిణామాల మధ్య సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ సంచలనంగా మారింది. ఈ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *