జ’గన్’పై రాజారెడ్డి మిస్సైల్ – రాజకీయాల్లోకి జగన్ మేనల్లుడు రాజారెడ్డి

  • షర్మిల వదిలిన బాణంగా రంగంలోకి కొడుకు
  • వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా పరిచయం
  • జగన్ కు ఇద్దరూ కూతుళ్లే కావడంపై చర్చ

సహనం వందే, విజయవాడ:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే వై.ఎస్. కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు, ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్. షర్మిల కుమారుడు వై.ఎస్. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై షర్మిల కీలక ప్రకటన చేశారు. కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించేందుకు రాజారెడ్డిని తీసుకువెళ్లి ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… వై.ఎస్. రాజారెడ్డికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తాడంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో వై.ఎస్. కుటుంబంలో మరో రాజకీయ శక్తి ఉద్భవించబోతుందన్న చర్చ ఊపందుకుంది.

తల్లిచాటు బిడ్డకు రాజకీయ వేదిక…
ఇన్నాళ్లు వై.ఎస్. షర్మిల కుమారుడిగా, ఉన్నత విద్యావంతుడిగా పేరున్న రాజారెడ్డి రాజకీయంగా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా ఉన్నారు. కానీ తాజాగా ఆయన రాజకీయాల్లోకి రావాలని షర్మిల నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని మరీ షర్మిలతో కలిసి కర్నూలు మార్కెట్ యార్డ్‌కు వెళ్లారు. అక్కడ ఉల్లి రైతులను పరామర్శించారు. ఈ సమయంలో రాజారెడ్డి తన తల్లి పక్కనే ఉన్నారు. రాజారెడ్డిని పొలిటికల్ ఎంట్రీ కోసమే తీసుకువచ్చారా అని మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల ఇచ్చిన సమాధానం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

జగన్ పార్టీలో కలవరం…
వై.ఎస్. షర్మిల, ఆమె కుమారుడు రాజారెడ్డి వేస్తున్న అడుగులు జగన్ పార్టీ వైసీపీలో కలవరం సృష్టిస్తున్నాయి. వైఎస్ఆర్ శైలిలో రాజారెడ్డి ప్రవర్తిస్తే తమకు ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. జగన్‌కు ఇద్దరూ కూతుళ్లే కావడంతో వై.ఎస్. కుటుంబ వారసుడిగా రాజారెడ్డిని ముందుకు తీసుకొచ్చేందుకు షర్మిలకు అవకాశం దక్కింది. గతంలో వై.ఎస్. జగన్ వదిలిన బాణం షర్మిల కాగా, ఇప్పుడు షర్మిల విడిచిన బాణం రాజారెడ్డి అవుతాడన్న వాదన వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో వైసీపీని, ముఖ్యంగా జగన్ మామను ఢీకొట్టేది మేనల్లుడు రాజారెడ్డి అన్న చర్చ కడప జిల్లాలో ఇప్పటికే మొదలైంది. రాబోయే రోజుల్లో రాజారెడ్డి రాజకీయాల్లో ఎలాంటి అడుగులు వేస్తాడో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *