- తెలంగాణలో కాళేశ్వరం… ఆంధ్రలో లిక్కర్
- కేసీఆర్ కుటుంబంపై సీబీఐతో దర్యాప్తు
- జగన్ కేంద్రంగా లిక్కర్ స్కాంపై సిట్
- ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్, వైసీపీ
సహనం వందే, హైదరాబాద్/అమరావతి:
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీలు ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీలు అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, మద్యం కుంభకోణం ఈ రెండు పార్టీల పతనానికి కారణమవుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు కేసీఆర్ కుటుంబం సీబీఐ విచారణల నీడలో చిక్కుకుంటే, మరోవైపు జగన్ చుట్టూ సిట్ విచారణల ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణాల పర్వం తెలుగు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తోంది.
కాళేశ్వరం… కేసీఆర్ కుటుంబానికి గండం
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. ఈ ప్రాజెక్టులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో, మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా విచారణ ఎదుర్కోవాల్సి రావొచ్చని తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు ఈ దర్యాప్తు బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇది బీఆర్ఎస్‌కు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
మద్యం కేసులో జగన్‌కు ఉక్కిరిబిక్కిరి
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీపై అధికార కూటమి మద్యం కుంభకోణంపై ఎక్కుపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చింది. ఇతర కేసుల్లో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి మీడియా ద్వారా ప్రతిపక్షాలపై చేసిన విమర్శలు ఇప్పుడు అదే మీడియా సంస్థ ఉద్యోగులను కూడా చుట్టుముట్టాయి. ఈ పరిణామాలు జగన్‌ను రాజకీయంగా ఒంటరిని చేస్తున్నాయని, పార్టీలో అంతర్గత కలహాలు మరింత పెరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్‌లో సునామీ… కవిత రాజీనామా
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సంక్షోభం తీవ్రమైంది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం చేసి చివరకు సస్పెండ్ అయ్యారు. ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, కొత్త పార్టీ పెడతారని లేదా ఏదైనా పార్టీ ద్వారా తిరిగి రాజకీయాల్లోకి వస్తారని వస్తున్న వార్తలు బీఆర్ఎస్ కార్యకర్తల్లో నైరాశ్యం నింపాయి. కాళేశ్వరం అవినీతి ఆరోపణల్లో కవిత పేరు కూడా వినిపించడంతో కుటుంబంలో చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అధికార పార్టీల వ్యూహం…
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ఒకే రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. కాళేశ్వరం, మద్యం కుంభకోణాలను రాజకీయ ఆయుధాలుగా వాడుకుని ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ దాడులతో బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు ఆత్మరక్షణ వైఖరిని అవలంబించాల్సి వస్తోంది. ఈ రాజకీయ యుద్ధంలో గెలుపు ఎవరిదైనా, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వివాదాలు యూరియా కొరత వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని విమర్శలు వస్తున్నప్పటికీ, అధికార కూటమి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది.