- విదేశాలకు వసుధ ఫార్మా కెమ్ మత్తు సరఫరా
- హైదరాబాద్ వసుధ ఫార్మా కంపెనీ నిర్వాకం
- దీంతో న్యూయార్కులో సీఈవో, డైరెక్టర్ల అరెస్ట్
- అరెస్టు జరిగి 5 నెలలైనా ఇక్కడ గప్ చిప్
- తాజాగా వసుధ ఫార్మా డైరెక్టర్ ఆత్మహత్య
- సంచలనం సృష్టిస్తున్న ఆత్మహత్య, అరెస్టులు
- ఈ విషయాన్ని పట్టించుకోని రెండు రాష్ట్రాలు
సహనం వందే, హైదరాబాద్:
వసుధ ఫార్మా కెమ్ కంపెనీ అమెరికాతో సహా పలు దేశాల్లో డ్రగ్ నరమేధం సృష్టిస్తుంది. ఆ కంపెనీ ప్రమాదకర ఫెంటానిల్ డ్రగ్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను ఏకంగా అమెరికాకే సరఫరా చేయడంతో ఆ దేశంలో వందల మంది చనిపోయారు. దీంతో ఆ కంపెనీ సీఈవో, మార్కెటింగ్ డైరెక్టర్లను ఈ ఏడాది మార్చి 20వ తేదీన అమెరికా ఫెడరల్ ఏజెన్సీ అరెస్టు చేయడంతో హైదరాబాద్ పరువు గంగలో కలిసింది. దీనిపై అప్పుడే సహనం వందే “హైదరాబాద్ డ్రగ్స్‌తో అమెరికాలో మరణ మృదంగం” https://sahanamvande.com/?p=3325,
ప్రత్యేక న్యూస్ ఆర్టికల్ 29.03.2025 తేదీన ప్రచురించింది.

తాజాగా ఆదివారం వసుధ డైరెక్టర్ (వర్క్స్) మంతెన వెంకట సూర్య నాగవర ప్రసాదరాజు (61) ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. హైదరాబాదులో ప్రధాన కార్యాలయం… ఆంధ్రప్రదేశ్ లో తయారీ కేంద్రం ఉన్న వసుధ ఫార్మా కెమ్ దేశ పరువును బజారున పెట్టింది. దీని తయారీ ఉత్పత్తుల వల్ల ఆయా దేశాల్లో అనేకమంది డ్రగ్స్ బారిన పడి చనిపోయినట్లు అమెరికా ఫెడరల్ ఏజెన్సీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో హైదరాబాద్‌లోని ఫార్మా సంస్థలు నిషేధిత డ్రగ్స్ ముడి పదార్థాల సరఫరాకు కేంద్రంగా మారుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇండియాలో గుంభనంగా వ్యవహారం…
వసుధ ఫార్మా కెమికల్స్ కంపెనీ 1994లో ఏర్పాటైంది. దీనికి ఎంవీ రామరాజు సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వరప్రసాదరాజు బల్క్ డ్రగ్ తయారీ రంగంలో చాలాకాలంగా పనిచేస్తున్నారు. కంపెనీకి చెందిన ప్రాజెక్టు వర్క్‌లన్నీ ఆయన సమన్వయం చేస్తుంటారు. కంపెనీ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఉండగా, ప్రధాన కార్యాలయం హైదరాబాద్ కావూరి హిల్స్‌లో ఉంది. ఈ కంపెనీ ‘ఫెంటానిల్’ అనే మందును తయారుచేసి అమెరికా, తదితర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తోంది. దానిని నొప్పి నివారణకు ఉపయోగిస్తారు.

అయితే ఫెంటానిల్ వినియోగంతో అమెరికాలో 12 నెలల కాలంలో వందల మంది మరణించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి ఈ డ్రగ్ వసుధ ఫార్మా నుంచి వస్తోందని గుర్తించింది. దీంతో ఇద్దరిని న్యూయార్క్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కంపెనీ నిధులను ఈ సంస్థ అక్రమంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించిందనే అనుమానాలతో ఆదాయ పన్ను శాఖాధికారులు 2023 మార్చి 20న ఏకకాలంలో 50 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కంపెనీ అక్రమ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తుంది.
కొకైన్, హెరాయిన్ తయారీ ముడి పదార్థాలు…
హైదరాబాదులోని ఫార్మా కంపెనీలు గతంలోనూ ఇలాంటి పిచ్చి పనులు చేశాయి. లాభం కోసం ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా వ్యవహరించాయి. 2017లో హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ కొకైన్, హెరాయిన్ తయారీకి సంబంధించిన కెమికల్స్‌ను మెక్సికోకు ఎగుమతి చేసింది. భారత డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (డీఈఏ) దాడులు చేసి పలువురిని అరెస్టు చేసింది. అమెరికాకు ఓపియాయిడ్ ప్రికర్సర్స్ అక్రమంగా ఎగుమతి చేసిన కేసులో అమెరికా సంబంధిత అధికారులను అరెస్టు చేసింది. భారత్‌లో దర్యాప్తు జరిగింది. అనంతరం సంస్థ లైసెన్స్ రద్దయింది. అలాగే 2020లో మరో హైదరాబాద్ ఫార్మా సంస్థ మెథాంఫెటమైన్ (మెథ్) తయారీకి ప్రికర్సర్ కెమికల్స్‌ను ఆసియా దేశాలకు సరఫరా చేసింది. ఈ ఘటనలో భారత అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఎదుగుతున్నా కొద్దీ కక్కుర్తి పనులు…
హైదరాబాద్ పరిధిలో 800 కు పైగా ఫార్మా కంపెనీలు ఉండగా, ఈ రంగంలో సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డాక్టర్ రెడ్డీస్, హెటిరో, అరబిందో వంటి ప్రముఖ సంస్థలు జనరిక్ మందులు, వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంతటి ఘనత సాధించిన హైదరాబాద్ కంపెనీలు మరోవైపు అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకునేలా వ్యవహరిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కానీ ఏమాత్రం స్పందించడం లేదు.
ఫార్మా కంపెనీలతో రాజకీయ, అధికార పెద్దలకు ఉన్న సంబంధాల వల్లే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఒక కంపెనీ సీఈఓ, డైరెక్టర్ మత్తు ముడి పదార్థాల తయారీ స్కామ్ లో అమెరికాలో అరెస్ట్ అయితే కనీసం ఆ కంపెనీ ఆఫీస్ దగ్గరికి వెళ్లడానికి కూడా జంకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక రెస్టారెంట్లో నాసిరకపు ఆహారం వండుతున్నారన్న ఆరోపణలు వస్తే చాలు హడావుడి చేసే నాయకులు, అధికారులు ఇంత పెద్ద కుంభకోణం జరిగితే మౌనం దాల్చడం వెనక అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.