ఫెంటానిల్ ముడి పదార్థాల అక్రమ రవాణా
– హైదరాబాద్ నుంచి న్యూయార్క్ కు సరఫరా
– విటమిన్ సీ లేబుళ్లు పెట్టి దేశాన్ని దాటించారు
– అక్రమ డ్రగ్ ముఠాలకు పంపారని నిర్ధారణ
– వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ కంపెనీ నిర్వాకం
– అమెరికాలో ఫెంటానిల్ ఓవర్‌డోస్ తో లక్షలాది మరణాలు
– అమెరికాలో కంపెనీ సీఈవో, డైరెక్టర్ల అరెస్ట్
– అంతర్జాతీయంగా సంచలనం రేపుతున్న వార్త
– ఔషధ నియంత్రణ సంస్థ, కస్టమ్స్ ఫెయిల్యూర్
సహనం వందే, హైదరాబాద్
అమెరికాలో లక్షలాది మంది మరణాలకు కారణమైన ఫెంటానిల్ తయారీ ముడి రసాయన పదార్థాలను హైదరాబాద్ లోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ కంపెనీ అక్రమంగా సరఫరా చేసినట్లు అమెరికా న్యాయశాఖ (డీఓజే) నిర్ధారించింది. హైదరాబాద్ లోని కావూరి హిల్స్ లో ఉన్న వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ కంపెనీ నుండి ఈ ముడి పదార్థాలను న్యూయార్క్ నగరానికి పంపించారని వెల్లడించింది. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ అనే రసాయన తయారీ సంస్థతో పాటు, ఆ సంస్థలోని ముగ్గురు కీలక ఉద్యోగులపై అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది.
వసుధ కంపెనీ చీఫ్ గ్లోబల్ బిజినెస్ ఆఫీసర్ తన్వీర్ అహ్మద్ మొహమ్మద్ హుస్సేన్ పార్కర్, మార్కెటింగ్ డైరెక్టర్ వెంకట నాగ మధుసూదన్ రాజు మంతెన, మార్కెటింగ్ ప్రతినిధి కృష్ణ వెరిచర్లపై అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ఫెంటానిల్ ముడి రసాయనాలను దిగుమతి చేయడానికి కుట్ర పన్నినట్లు అభియోగాలు నమోదు చేశారు. పార్కర్, మంతెనలను న్యూయార్క్ నగరంలో ఫెడరల్ ఏజెంట్లు అరెస్టు చేశారు.
మధుసూదన్ రాజు మంతెన
పార్కర్
రహస్య ఏజెంట్లకు విక్రయం…
2024 మార్చి నుండి నవంబర్ వరకు, నిందితులు అమెరికాలోకి అక్రమంగా ఆ రసాయనాలను పంపిణీ చేయడానికి కుట్ర పన్నినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు. రహస్య ఏజెంట్‌కు 25 కిలోల ఎన్-బీఓసీ-4పీ రసాయనాన్ని విక్రయించినట్లు కూడా ఆరోపించారు. నిందితులు 4,000 కిలోల ఆ రసాయనాన్ని మెక్సికో, అమెరికాకు సరఫరా చేయడానికి ప్రయత్నించారని అమెరికా అధికారులు తెలిపారు. ఈ రసాయనాన్ని ఫెంటానిల్ తయారీకి ఉపయోగిస్తారని తెలిసినా, వారు ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడ్డారని అభియోగపత్రంలో పేర్కొన్నారు.
“విటమిన్ సీ” వంటి తప్పుడు లేబుళ్లతో…
హైదరాబాదు నుంచి అక్రమ ఎగుమతులపై భారత ఔషధ పరిశ్రమపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. ఈ సంఘటన అంతర్జాతీయంగా సంచలన రేపుతోంది. మరోవైపు భారతదేశంలో ఔషధ పరిశ్రమ నియంత్రణలో లోపాలు వెలుగు చూశాయి. అంతేకాదు వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ కంపెనీ ఫెంటానిల్ తయారీకి అవసరమైన ముడి రసాయనాలను “విటమిన్ సి” వంటి తప్పుడు లేబుళ్లతో అమెరికాకు ఎగుమతి చేయడం విస్మయం కలిగిస్తుంది. ఈ పదార్థాలు మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్ చేతులకు చేరి, ఫెంటానిల్ గా మార్చి, అక్కడి నుంచి అమెరికాలో అక్రమంగా నిషేధిత మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ఫెంటానిల్ ప్రాణాంతకం…
ఫెంటానిల్ అనేది చాలా శక్తివంతమైన మత్తు పదార్థం. ఇది మార్ఫిన్ కంటే 50 నుండి 100 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. సింథటిక్ ఓపియాయిడ్. వైద్యంలో అధిక నొప్పిని తగ్గించడానికి, ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు, ఆపరేషన్ల తర్వాత ఉపయోగిస్తారు. కానీ దీన్ని అక్రమంగా తయారు చేసి వాడటం వలన చాలా మంది చనిపోతున్నారు. అమెరికాలో 2020 నుంచి ఇప్పటివరకు ఫెంటానిల్ వల్ల 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని “డ్రగ్ మహమ్మారి” అని కూడా పిలుస్తున్నారు.
హైదరాబాద్ ఫార్మా పరిశ్రమపై దెబ్బ…
ఈ సంఘటన హైదరాబాద్ ను ఫార్మా హబ్ కు అంతర్జాతీయంగా చెడ్డ పేరు తెచ్చింది. భారతదేశంలో ఔషధ ఎగుమతుల నియంత్రణ సరిగ్గా లేదని అమెరికా ఆరోపిస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. కాగా, వసుధ ఫార్మా కెమ్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు.
ప్రపంచ దేశాల ఒత్తిడి…
ఈ సంఘటన భారత ఔషధ ఎగుమతులపై భవిష్యత్తులో ప్రభావం చూపుతుంది. అమెరికా, మెక్సికోలో ఫెంటానిల్ సమస్య పెరుగుతున్న సమయంలో, భారతదేశం నుండి ముడి రసాయనాలు సరఫరా ఆగకపోతే కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితికి దారి తీసింది. అమెరికా డాక్యుమెంట్ తో బయటపడిన ఈ అక్రమ రవాణా కేసు, హైదరాబాద్ ఫార్మా సంస్థలపై ప్రపంచ దృష్టిని ఇటువైపు తిప్పింది.
నియంత్రణలో వైఫల్యాలు…
1. భారత ఔషధ నియంత్రణ సంస్థలు:
– ఎగుమతి ద్వారా ఇటువంటి ప్రమాదకర రసాయనాలు ఎలా బయటకు వెళ్లాయి? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఎందుకు గమనించలేదు?
2. నిద్రపోతున్న కస్టమ్స్:
– “విటమిన్ సి” పేరుతో ఫెంటానిల్ ముడి పదార్థాలను ఎలా తప్పించారు? కష్టమ్ అధికారులు నిద్రపోతున్నారా?
3. కంపెనీకి నైతిక బాధ్యతలు లేవా:
– వసుధ ఫార్మా కెమ్ వంటి కంపెనీలు ఎందుకు ఇలాంటి అక్రమ వ్యాపారంలో నిమగ్నమయ్యాయి? లాభాల కోసం మానవ జీవితాలను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాయనేది అర్థమవుతుంది? అటువంటి కంపెనీలపై నిషేధం విధించాలి.