- బీజేపీలో అంతర్గత గొడవలే కారణం
- మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
- దాడి చేసిన వారిపై మార్వాడి సవాల్
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక మార్వాడీపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలే ఈ దాడికి కారణమని స్పష్టమవుతోంది. ఆర్కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి, విజయ్ దేవడా అనే మార్వాడీపై దాడి చేశారు. ఆర్కేపురంలో విజయ్ దేవడా ఏర్పాటు చేసిన వినాయకుడి దర్శనానికి సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిని ఆహ్వానించారు. దీనిపై ఆగ్రహించిన ధీరజ్ రెడ్డి తన అనుమతి లేకుండా తన డివిజన్‌కు మరో కార్పొరేటర్‌ను ఎలా పిలుస్తావంటూ విజయ్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది.
ప్రాణభయం అంటూ విజయ్ ఆరోపణ…
తాను మహేశ్వరం, ఆర్కేపురంలో ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని ధీరజ్ రెడ్డి హుకుం జారీ చేశాడని విజయ్ ఆరోపించారు. ధీరజ్ రెడ్డితో పాటు మరో ఇరవై మంది అనుచరులు తనను కిడ్నాప్ చేసి పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లారని, మెడకు పార్టీ కండువాలు బిగించి హత్య చేయడానికి ప్రయత్నించారని విజయ్ తెలిపాడు. ‘మార్వాడీ… నీకెందుకు రాజకీయం?’ అంటూ తనను దూషించి విపరీతంగా కొట్టారని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న తన తండ్రి, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తనను విడిపించి ఆస్పత్రిలో చేర్పించారని విజయ్ వివరించాడు. కేవలం రాజకీయ కక్షతోనే తనపై దాడి చేశారని, తనకు ధీరజ్ రెడ్డితో ప్రాణభయం ఉందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు…
ఈ దాడిపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశానని విజయ్ తెలిపాడు. రాజకీయ కక్షతో దాడి చేసిన ధీరజ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాను ఇకపై ఆర్కేపురంలో రాజకీయం చేస్తానని ధీరజ్ రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం సాగుతున్న తరుణంలో బీజేపీ కార్పొరేటర్ భర్త దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఉద్యమాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యతిరేకిస్తున్నప్పటికీ సొంత పార్టీ నాయకులే మార్వాడీలపై దాడి చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్న తలెత్తుతుంది.