- అది కేవలం రైలు కాదు… ఒక మొబైల్ కోట!
- వారసత్వానికి చిహ్నం… వ్యూహానికి అద్దం
- అంతర్జాతీయ వంటకాలతో ఘుమఘుమలు
సహనం వందే, ఉత్తర కొరియా:
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆరేళ్ల తర్వాత పొరుగు దేశం చైనాలో పర్యటించిన ఆయన విమానంలో కాకుండా తన ప్రత్యేకమైన బాంప్రూఫ్ రైలులో ప్రయాణించడం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రైలు కేవలం ప్రయాణ సాధనం కాదు. ఒక కదిలే భద్రతా కోట. సుమారు 90 కోచ్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ రక్షణ, మిస్సైల్ వ్యవస్థ, బాంబు నిరోధక వ్యవస్థలు, అత్యంత విలాసవంతమైన సదుపాయాలతో కూడిన ఈ రైలు నిర్మాణం నిర్వహణకు కోట్ల డాలర్లు ఖర్చు చేశారని అంచనా. నెమ్మదిగా కదులుతూ ప్రపంచానికి ఒక రహస్యమైన రాజకీయ సందేశాన్ని పంపుతున్న ఈ రైలు ప్రయాణం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?

వారసత్వానికి చిహ్నం… వ్యూహానికి అద్దం
కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్, తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కూడా విమాన ప్రయాణానికి బదులు ఈ ప్రత్యేక రైలునే ఉపయోగించేవారు. భద్రతా కారణాలతో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు ఒక రాజకీయ చిహ్నంగా మారింది. రెండు గంటల విమాన ప్రయాణానికి బదులు ఇరవై గంటల రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం కేవలం భద్రతా ఆందోళన మాత్రమే కాదు. ఇది తమ దేశంపై ఎవరూ పెత్తనం చేయలేరని, తమ నిర్ణయాలు స్వతంత్రంగా ఉంటాయని కిమ్ ప్రపంచానికి చెప్పే ఒక సందేశం. చైనాలో పర్యటిస్తూనే తాను ఎవరి ఒత్తిడికీ లొంగనని, తన దేశానికి తనదైన ప్రత్యేక గుర్తింపు ఉందని కిమ్ చాటిచెబుతున్నారు. 2019లో చైనా, 2023లో రష్యాలో పర్యటించిన టైంలోనూ ఆయన రైలు మార్గం గుండానే ప్రయాణించారు. ఉత్తర కొరియా పాలకులకు ఇలా రైలు ప్రయాణం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది.
50 కిలోమీటర్ల వేగంతోనే…
కిమ్ ప్రయాణించిన ఈ రైలు గంటకు కేవలం 50 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. వేగం కంటే భద్రత, వ్యూహమే ముఖ్యమని ఈ ప్రయాణం స్పష్టం చేస్తుంది. రష్యా, చైనా దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడం ద్వారా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయాలన్నది కిమ్ లక్ష్యం. బీజింగ్‌లో జరిగే సైనిక కవాతులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి పాల్గొనడం ఈ వ్యూహంలో ఒక భాగమే. ఈ రైలులో ఉన్న అత్యాధునిక కమాండ్ సెంటర్ ద్వారా ప్రయాణంలోనే కిమ్ కీలక నిర్ణయాలు తీసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ వంటకాలతో ఘుమఘుమలు…
కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించే రైలు మామూలుది కాదు. ఈ రైలులో కాన్ఫరెన్స్ రూమ్, బెడ్రూమ్స్, ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, అంతర్జాతీయ వంటకాలు, ఖరీదైన రెడ్ వైన్లు అందుబాటులో ఉంటాయి. రైలు అంతర్గతంగా పింక్ లెదర్ ఆర్చైర్లు, జెబ్రా ప్రింట్ డిజైన్, బోర్డో వైన్లు, లాబర్లు, అంతర్జాతీయ వంటకాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, బెడ్రూమ్స్ రాజసంగా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చెఫ్లు, రెడ్ వైన్లు, నృత్య కళాకారుల బృందం ఆయన వెంట ప్రయాణిస్తారు. అయితే అది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కాదు పూర్తిగా బాంప్రూఫ్. ఈ స్థాయి సౌకర్యాలు, భద్రతా వ్యవస్థలు కలిగి ఉండే రైలు నిర్మాణం, నిర్వహణకు సుమారుగా రూ.2,400 కోట్ల వరకు ఖర్చు అయ్యిందనే అంచనా.