గాజా యుద్ధంలో జర్నలిస్టుల ఊచకోత – 210 మంది హత్య

  • అంతర్జాతీయంగా మీడియా గొంతు కోసే కుట్ర
  • 50 దేశాల 200 మీడియా సంస్థలు నిరసన
  • ప్రముఖ అమెరికా ఛానల్ సీఎన్ఎన్ వెల్లడి

సహనం వందే, న్యూయార్క్:
గాజా యుద్ధంలో జర్నలిస్టులను టార్గెట్ చేసి ఇజ్రాయిల్ హత్య చేస్తోందని ఆరోపిస్తూ ప్రపంచ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 50 దేశాల నుంచి 200కు పైగా మీడియా సంస్థలు సోమవారం భారీ నిరసనలకు దిగాయి. పత్రికలు నల్లటి ముఖ చిత్రాలను ప్రచురించగా… టెలివిజన్, రేడియోలు తమ ప్రసారాలను నిలిపివేశాయి. ఈ నిరసన ద్వారా గాజాలో స్వేచ్ఛాయుత వార్తా కవరేజీకి అనుమతించాలని, అమాయక జర్నలిస్టుల హత్యలను ఆపాలని డిమాండ్ చేశాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, అవాజ్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ నిరసనను సమన్వయం చేశాయని ప్రముఖ అంతర్జాతీయ అమెరికన్ ఛానల్ సీఎన్ఎన్ వెల్లడించింది.

ఆధునిక చరిత్రలో అత్యంత ప్రమాదకర యుద్ధం
2023 అక్టోబర్ 7న గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 210 మందికి పైగా జర్నలిస్టులు మరణించారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ వెల్లడించింది. ఆధునిక చరిత్రలో జర్నలిస్టులకు ఇది అత్యంత ప్రమాదకర యుద్ధంగా నిలిచింది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ మీడియాకు గాజాలో ప్రవేశం నిరాకరించడంతో స్థానిక పాలస్తీనా జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి వార్తలు సేకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారు కావాలనే లక్ష్యంగా మారుతున్నారని నిరసనకారులు తీవ్రంగా ఆరోపించారు.

టార్గెట్ చేసి మరీ హత్యలు…
గత కొద్ది వారాల్లో గాజాలో పలువురు ప్రముఖ పాలస్తీనా జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఆగస్టు ఆరంభంలో గాజా నగరంపై జరిగిన దాడిలో అల్-జజీరా నెట్‌వర్క్‌కు చెందిన అయిదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనస్ అల్-షరీఫ్ ఉన్నారు. అరబ్ ప్రపంచంలో అనస్ తన ధైర్యమైన రిపోర్టింగ్‌తో గుర్తింపు పొందారు. ఖాన్ యూనిస్‌లోని నాసర్ ఆసుపత్రిపై జరిగిన దాడిలో మరో అయిదుగురు జర్నలిస్టులు మరణించడం ప్రపంచ మీడియాను కలచివేసింది.

డబుల్ ట్యాప్ దాడుల దుర్మార్గం…
నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన డబుల్ ట్యాప్ దాడులు ఈ హత్యల వెనుక దాగి ఉన్న ఉద్దేశాన్ని బయటపెట్టాయి. మొదటి దాడి తర్వాత వార్తలు సేకరించేందుకు, సాయం చేసేందుకు జర్నలిస్టులు, సిబ్బంది ఆసుపత్రికి చేరుకున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ రెండోసారి దాడి చేసింది. సీఎన్‌ఎన్ మీడియాకు అందిన వీడియోల ప్రకారం… ఈ రెండో దాడిలో చాలామంది మరణించారని వెల్లడైంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు.

జర్నలిజంపైనే యుద్ధమా?
గాజాలో జర్నలిస్టుల హత్యలు కేవలం యుద్ధ పరిణామాలు కాదని, ఇది జర్నలిజంపై జరుగుతున్న యుద్ధమని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ డైరెక్టర్ జనరల్ థిబాట్ బ్రుట్టిన్ ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను టార్గెట్ చేసి హత్య చేయడం, వారిపై అబద్ధాలు ప్రచారం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. జర్నలిస్టులు లేకపోతే కరువు, యుద్ధ నేరాలు, జాతి సంహారాలను ఎవరు బయటపెడతారని ఆయన ప్రశ్నించారు. ఈ నిరసన ద్వారా గాజాలో జర్నలిస్టుల రక్షణ, స్వేచ్ఛాయుత రిపోర్టింగ్‌కు అనుమతి ఇవ్వాలని ప్రపంచ మీడియా డిమాండ్ చేస్తోంది. ఈ హత్యలు ఆగకపోతే గాజా నుంచి ప్రపంచానికి సమాచారం అందించేవారే మిగలరని నిరసనకారులు హెచ్చరిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *