అవినీతి అనకొండ హరీష్ – శివాలెత్తిన కవిత… బావపై తీవ్ర ఆరోపణలు

  • కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీశ్ రావు
  • అనకొండ వెనుక సంతోష్… మెగా కృష్ణారెడ్డి
  • వారివల్లే కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు
  • బహిష్కరించే యోచనలో బీఆర్ఎస్ పార్టీ
  • ఆమె తదుపరి కార్యాచరణపై పొలిటికల్ హీట్
  • పార్టీ పెడతారా? బీజేపీ లేదా కాంగ్రెస్ లోకా?

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు ఒకవైపు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. మాజీ మంత్రి, తన బావ హరీశ్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మూల కారణమని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వారి స్వార్థం, అవినీతి వల్లే తన తండ్రి కేసీఆర్‌పై అవాంఛనీయ ఆరోపణలు వచ్చాయని ఆమె మీడియా ఎదుట నిప్పులు చెరిగారు.

హరీశ్‌, సంతోష్‌లే అవినీతి అనకొండలు
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన కవిత మీడియాతో మాట్లాడుతూ హరీశ్ రావు, సంతోష్ రావుల తీరుపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా వ్యవహరించిన హరీశ్ రావు, మేఘా కృష్ణారెడ్డితో కలిసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వారి స్వలాభం కోసమే కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఈ విషయంపై తన కడుపు రగిలిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రెండోసారి కేసీఆర్ ఇరిగేషన్ మంత్రి పదవి నుంచి హరీశ్‌ను తొలగించడానికి ఇదే ప్రధాన కారణమని కూడా ఆమె కుండబద్దలు కొట్టారు.

రేవంత్‌తో హరీష్ కుమ్మక్కు…
కవిత ఆరోపణలు హరీశ్‌కే పరిమితం కాలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీశ్ రావు, సంతోష్ రావుల మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని ఆమె ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం..‌ హరీశ్, సంతోష్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. నిజంగా దమ్ముంటే వారిద్దరిపై రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌పై ఎలాంటి ఆరోపణలు రుజువు కావని, ఆయన ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు.

తోలు తీస్తా… ట్రోలర్లకు హెచ్చరిక
తనపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌పై కవిత తీవ్రంగా స్పందించారు. హరీశ్, సంతోష్‌లు తమ అనుచరులతో తనపై చిల్లరగా కామెంట్లు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇకపై ఇలాంటి ప్రయత్నాలు చేస్తే సహించబోనని, ట్రోల్ చేసేవారి తోలు తీస్తానని తీవ్రంగా హెచ్చరించారు. పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు వస్తున్నందున నిజాలు బయటపెట్టక తప్పలేదని కవిత వివరించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి.

భవిష్యత్తు కార్యాచరణపై ఊహాగానాలు…
ఈ వ్యాఖ్యల తర్వాత ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమె పార్టీ పెడతారా? లేక బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీలో చేరతారా? అనేది రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేసీఆర్‌ను రక్షించుకోవడానికి కవిత ఈ ఆరోపణలు చేస్తున్నారా… లేక పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కవిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న హరీశ్ రావుపై బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయంగా పెద్ద పరిణామంగా పరిగణించాలి. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *