కమ్యూనిస్టు కారులో మోడీ షికారు – చైనాలో హాంగ్చీ ఎల్5లో మోడీ ప్రయాణం

  • కమ్యూనిస్ట్ పార్టీ నేతల కోసం లిమోసిన్‌
  • అక్కడ పర్యటనలో ప్రధానికి కేటాయింపు
  • ‘మేడ్ ఇన్ చైనా’కు ప్రతిబింబం ఈ కారు
  • అమెరికా అధ్యక్షుడి ‘ది బీస్ట్’కు ధీటైనది
  • రోడ్డుపై రాజభవనం కదులుతున్నట్టు ఫీలింగ్
  • మసాజ్, వెంటిలేషన్, హీటింగ్ ఫెసిలిటీ సీట్లు

సహనం వందే, చైనా:
షాంఘై సహకార సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సొంతంగా వాడే అత్యంత ప్రతిష్టాత్మకమైన కారు హాంగ్చీ ఎల్5 లిమోసిన్‌లో ఆయన ప్రయాణించారు. ఈ కారు కేవలం ఉన్నత స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, ఎంపిక చేసిన విదేశీ అతిథులకు మాత్రమే కేటాయించేది. 2019లో జిన్‌పింగ్ భారత్‌క వచ్చినప్పుడు ఇదే కారులో ప్రయాణించారు. ఈ కారు కేవలం ఒక వాహనం కాదు, చైనా రాజకీయ చిహ్నం. ఆ దేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది.

రెడ్ ఫ్లాగ్ వెనుక కథ
హాంగ్చీ అంటే మాండరిన్ భాషలో రెడ్ ఫ్లాగ్ (ఎర్ర జెండా) అని అర్థం. చైనా ప్రభుత్వ రంగ సంస్థ ‘ఫస్ట్ ఆటోమొబైల్ వర్క్స్ గ్రూప్’ దీన్ని తయారు చేస్తుంది. ఈ కారు చైనాలో తయారైన ఉత్పత్తులన్నింటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణిస్తారు. 1950ల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ నేతల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కారు ఉత్పత్తి, కొన్ని దశాబ్దాల తర్వాత నిలిచిపోయినా, 1990ల నాటికి తిరిగి పుంజుకుంది. నేడు, హాంగ్చీ ఎల్5 చైనాలోనే అత్యంత ఖరీదైన, అత్యున్నత స్థాయి కారుగా మారింది.

శక్తిమంతమైన ఇంజిన్, అధునాతన ఫీచర్లు
హాంగ్చీ ఎల్5 కారులో ఆరు లీటర్ల వి12 ఇంజిన్ ఉంటుంది. ఇది దాదాపు 400 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 8.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు, గంటకు గరిష్టంగా 210 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 5.5 మీటర్ల పొడవు, మూడు టన్నుల బరువుతో ఇది ఒక కారులా కాకుండా రోడ్డుపై ఒక రాజభవంలా కనిపిస్తుంది. లోపలి భాగంలో మసాజ్, వెంటిలేషన్, హీటింగ్ సౌకర్యాలతో కూడిన విశాలమైన సీట్లు ఉంటాయి. ప్రయాణీకులను అలరించడానికి అత్యాధునిక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

బాంబులను తట్టుకునే బాడీ…
ఈ కారులో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఆల్-వీల్ డ్రైవ్, 360 డిగ్రీల కెమెరాలు, ఆటోమేటిక్ స్పీడ్ కంట్రోల్ వంటివి ఇందులో భాగం. జిన్‌పింగ్ బహిరంగ కార్యక్రమాలకు ఉపయోగించే హాంగ్చీ ఎన్701 అనే మరో నమూనా అయితే అమెరికా అధ్యక్షుడి ‘ది బీస్ట్’ కారుతో పోల్చదగినంత భద్రతను కలిగి ఉంటుంది. ఈ ఎన్701 కారులో బుల్లెట్‌ప్రూఫ్ అద్దాలు, బాంబులను తట్టుకునే బాడీ, అత్యున్నత కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయని సమాచారం. దాని సాంకేతిక వివరాలు అత్యంత రహస్యంగా ఉన్నప్పటికీ, ఇది దేశాధినేతలకు తిరుగులేని రక్షణను అందిస్తుందని చెప్పవచ్చు.

ఖరీదైన గౌరవం… చైనా ఆత్మగౌరవం
హాంగ్చీ ఎల్5 ధర సుమారు ఏడు కోట్ల రూపాయలు. చైనాలో తయారైన కార్లన్నింటిలో ఇదే అత్యంత ఖరీదైనది. ఈ కారు కేవలం ఒక లగ్జరీ వాహనం మాత్రమే కాదు… చైనా సంస్కృతిని, రాజకీయ గుర్తింపును, దేశీయ ఉత్పత్తులపై ఉన్న నమ్మకాన్ని ప్రపంచానికి చాటిచెబుతుంది. రెడ్ ఫ్లాగ్ డిజైన్ కమ్యూనిస్ట్ పార్టీ గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రధాని మోదీ ఈ కారులో ప్రయాణించడం చైనా అందించిన ఒక రాజకీయ గౌరవం. మోడీకి ఈ కారు కేటాయింపు ఇరు దేశాల మధ్య సంబంధాల ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు… చైనా శక్తి, సంస్కృతి, ఆత్మగౌరవానికి ఒక చిహ్నం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *