వ్యవసాయ విస్త’రణం’అధికారులు – ఏఈఓల ప్రమోషన్ల చిక్కుముడి

  • వ్యవసాయ శాఖలో అందని ప్రమోషన్లు
  • గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం ఆవేదన

సహనం వందే, హైదరాబాద్:
వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పదోన్నతులు అంతులేని చిక్కుముడిగా మారాయి. వ్యవసాయంలో డిగ్రీ (బీఎస్సీ అగ్రికల్చర్) పూర్తి చేసి నేరుగా ఏఈఓలుగా నియమితులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం ఆరోపించింది. మరోవైపు కేవలం డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవారు ఇన్-సర్వీస్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి సీనియారిటీని తొక్కేస్తున్నారని ఆ సంఘం మండిపడుతోంది. దీనివల్ల దాదాపు 750 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓలు తమ పదోన్నతుల కోసం తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని ఆ సంఘం నేత సుమన్ అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం కమిటీని వేసినా దాని సిఫారసులకు అమలు కరువైందని ఆయన విమర్శించారు.

సీనియారిటీని తారుమారు చేస్తున్న నిబంధనలు…
ప్రస్తుత నిబంధనల ప్రకారం… ఏఈఓ నుంచి ఏవోగా ప్రమోషన్ పొందాలంటే బీఎస్సీ అగ్రికల్చర్ తప్పనిసరి. ఇక్కడే గ్రాడ్యుయేట్ ఏఈఓల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇన్-సర్వీస్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన డిప్లొమా ఏఈఓలకు వారి తొలి నియామక తేదీని సీనియారిటీకి ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కానీ నేరుగా బీఎస్సీ అగ్రికల్చర్ చేసి చేరినవారికి మాత్రం వారు ఏఈఓగా జాయిన్ అయినప్పటి నుంచి మాత్రమే సీనియారిటీ లెక్కిస్తున్నారు.

ఈ వింత నిబంధన వల్ల ముందుగా చేరిన గ్రాడ్యుయేట్ ఏఈఓలు, ఆ తర్వాత చేరిన డిప్లొమా ఏఈఓల కంటే సీనియారిటీలో వెనుకబడిపోతున్నారని సంఘం నేతలు అంటున్నారు. 2020లో ప్రొబేషన్ పూర్తి చేసిన ఒక ఏఈఓ, సీనియారిటీ జాబితాలో మొదటి స్థానంలో ఉండి కూడా ఇప్పుడు 80వ స్థానానికి పడిపోయిన ఉదాహరణే దీనికి నిదర్శనం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రాడ్యుయేట్ ఏఈఓలు తమ ఉద్యోగ జీవితంలో కనీసం ఒక్క పదోన్నతి కూడా పొందలేకపోవచ్చని సుమన్ అంటున్నారు.

ప్రభుత్వానికి వందల కోట్ల భారంగా శిక్షణ
ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి ఇన్-సర్వీస్ శిక్షణ. ఇన్-సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా భారీ నష్టం జరుగుతోందని ఆ సంఘం నాయకుడు సుమన్ విమర్శించారు. ఒక డిప్లొమా ఏఈఓ ఈ కోర్సు పూర్తి చేయడానికి దాదాపు రూ.92 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ వ్యయంలో ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా రూ.30 లక్షల విలువైన ఉచిత సీటు, చదువుతున్న 48 నెలల కాలానికి రూ.50 లక్షల జీతం, అలాగే ఆ సమయంలో ఔట్‌సోర్సింగ్ ఏఈఓల కోసం మరో రూ.12 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు ఈ శిక్షణ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇంత వ్యయం చేసినప్పటికీ, ఈ విధానం గ్రాడ్యుయేట్ ఏఈఓల సీనియారిటీని దెబ్బతీసి, వారిని నిరాశలోకి నెడుతోందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

కమిటీ సూచనలు చెత్తబుట్టలో వేస్తారా?
ఈ అన్యాయంపై ప్రభుత్వం వేసిన నలుగురు సభ్యుల కమిటీ స్పష్టంగా నివేదిక ఇచ్చింది. గ్రాడ్యుయేట్ ఏఈఓలకు అన్యాయం జరుగుతోందని ఆ కమిటీ ధృవీకరించింది. అంతేకాకుండా ఏఈఓ నుంచి ఏవో పదోన్నతుల్లో 5:4:1 నిష్పత్తిని అమలు చేయాలని సిఫారసు చేసింది. దీని ప్రకారం 5% ప్రమోషన్లు ఇన్-సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన డిప్లొమా ఏఈఓలకు, 4% నేరుగా బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లకు, మిగిలిన 1% ఇతర అర్హతలున్న వారికి కేటాయించాలని సూచించింది.

కానీ ఈ నివేదిక ఇచ్చి చాలా కాలమైనా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కమిటీ సూచనల మేరకు తక్షణమే జీఓ జారీ చేసి ఈ ప్యానెల్ ఇయర్‌లోనే పదోన్నతులు కల్పించాలని గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం నాయకుడు సుమన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తీసుకునే నిర్లక్ష్య వైఖరి వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని ఆయన మండిపడ్డారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *