- రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం
- తెలంగాణలో వేడెక్కిన రాజకీయం
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో అట్టుడికిపోతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయించడం సంచలనం రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి లోతుగా దర్యాప్తు జరగాలన్న ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది.
సందేహాలకు తావులేదు: సీఎం
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఇప్పటికే ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికలు గత ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాయని గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తే చిత్తశుద్ధిని శంకిస్తారన్న ఉద్దేశంతోనే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని అన్నారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తప్పవని, లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉంటే వ్యయం, నిర్వహణ భారం తగ్గేదని… కానీ కాంట్రాక్టర్ల కమీషన్లకు కక్కుర్తిపడి అనవసరపు నిర్మాణాలకు పూనుకున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ వాకౌట్: గన్‌పార్కులో నిరసన జ్వాల
కాళేశ్వరంపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆదివారం రాత్రి నిరసనగా వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, సభా వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కుకు చేరుకున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పత్రాలను చెత్తబుట్టలో పడేసి వినూత్న నిరసన తెలిపారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేసేందుకు కుట్ర పడుతున్నాయని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ వాకౌట్, నిరసన కాళేశ్వరం కేసుపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వైరం మరింత తీవ్రమైందని స్పష్టం చేసింది.