ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ – అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు బంద్

  • ప్రభుత్వం వద్ద రూ. 1300 కోట్లు పెండింగ్
  • విడుదల చేయాలని విన్నవించినా నో రెస్పాన్స్
  • ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు అనారోగ్యం

సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన 1300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ పరిణామం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు చేసినందుకు తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నెట్‌వర్క్ ఆసుపత్రులు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని యాజమాన్యాలు తెలిపాయి. ఈ బిల్లుల పెండింగ్ చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, నిర్వహణ భారం అవుతోందని పేర్కొన్నాయి.

ఆర్థిక సంక్షోభంలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు…
తెలంగాణ ఆరోగ్యశ్రీ పథకంలో సేవలు అందిస్తున్న నెట్‌వర్క్ ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ సమస్యలను పరిష్కరించకపోతే 31వ తేదీ అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తామని తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఫర్ ఆరోగ్యశ్రీ (తాన్హా) అధ్యక్షులు డాక్టర్ వద్దిరాజు రాకేష్ వారం రోజుల కిందటే హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎస్) లాంటి పథకాల్లో సేవలు అందించడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు విజ్ఞప్తి చేసింది. ఆర్థిక ఒత్తిడి, బకాయిలు, సరైన విధానాల లేకపోవడం వల్ల ఆస్పత్రులు మూతపడే ప్రమాదం ఉందని తాన్హా ఆందోళన వ్యక్తం చేసింది. సేవలు నిలిపివేస్తామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ప్రైవేట్ ఆసుపత్రులు అంటున్నాయి.

ఆర్థిక ఒత్తిడితో ఆస్పత్రుల ఇబ్బందులు…
తెలంగాణలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆర్థిక ఒత్తిడితో సతమతమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని రాకేష్ పేర్కొన్నారు. సకాలంలో బకాయిలు అందకపోవడం వల్ల వైద్యులకు జీతాలు, ఏజెన్సీలకు బిల్లులు చెల్లించలేకపోతున్నాయి. ఈ పరిస్థితి వల్ల కొన్ని ఆస్పత్రులు మూతపడే ప్రమాదం ఏర్పడింది. డాక్టర్లు జీతాలు లేకపోవడంతో పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ఏజెన్సీలు కూడా బకాయిలు చెల్లించే వరకు వైద్య పరికరాలు సరఫరా చేయడం లేదు. ఈ ఆర్థిక ఇబ్బందులు ఆస్పత్రుల సేవల నాణ్యతను దెబ్బతీస్తున్నాయి, లబ్ధిదారులకు సక్రమంగా సేవలు అందడం కష్టమవుతోందని రాకేష్ పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారంలో జాప్యం…
గత జనవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శితో జరిగిన సమావేశంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు తమ సమస్యలను వివరించాయి. ఒప్పంద నిబంధనలను సవరించడం, ప్యాకేజీల రేట్లను పెంచడం, సకాలంలో చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కార విధానం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. అయినప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆస్పత్రులు మరింత ఇబ్బందుల్లో పడ్డాయి. గత ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పరిస్థితి మరింత దిగజారిందని తాన్హా ఆవేదన వ్యక్తం చేసింది. ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు సేవలు సజావుగా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *