- అపాయింట్మెంట్ లేకుండా మోడీని కలిశా
- ‘ద సీక్రెట్’ పుస్తకం ఎంతో ప్రభావితం చేసింది
- ఇప్పటి వరకు ఆ బుక్ ను 100 సార్లు చదివా
- గట్టిగా అనుకున్నాను… ఎంపీ అయ్యాను
- చంద్రబాబు, లోకేష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు
- ‘సహనం వందే’కు అప్పలనాయుడు ప్రత్యేక ఇంటర్వ్యూ
సహనం వందే, హైదరాబాద్:
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని కలలుగన్న ఆయన… ఏకంగా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంపీ అయిన వెంటనే తిరుపతికి వెళ్లి ప్రసాదం తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. మోడీ అపాయింట్మెంట్ లేదు. కానీ కలవాలన్న కృతనిశ్చయంతో వెళ్లారు. ఆయన నమ్ముకున్నట్లు మోడీ కలవడానికి అనుమతి లభించింది. ప్రసాదం చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన అనేకమంది ఎంపీలను ఆశ్చర్యపరిచింది. ఇలా తన జీవితంలో అనేక అద్భుతాలు జరగటానికి ప్రధాన కారణం ఒక గొప్ప పుస్తకం అంటారు ఆయన. ఆ పుస్తకమే ‘ద సీక్రెట్’. ఈ పుస్తకం తనను ఎలా ప్రభావితంగా చేసిందో ఆయన ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ కు వివరించారు. అందుకు సంబంచిన వివరాలను ‘సహనం వందే’ హైదరాబాద్ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

సహనం వందే: అప్పలనాయుడుగారు… ‘రహస్యం’ పుస్తకం గురించి తొలిసారి ఎప్పుడు తెలుసుకున్నారు?
అప్పలనాయుడు: నాకు ఈ పుస్తకం గురించి ఒక స్నేహితుడు చెప్పాడు. ఆ సమయంలో నేను రాజకీయ జీవితంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. అతను ఈ పుస్తకం చదవమని సూచించాడు. చదివిన తర్వాత నిజంగా నా ఆలోచనలపై నియంత్రణ ఎంత ముఖ్యమో అర్థమైంది.
సహనం వందే: ఈ పుస్తకం గురించి కొన్ని వివరాలు చెప్పండి. దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది?
అప్పలనాయుడు: రోండా బైర్న్ రాసిన రహస్యం పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను మార్చింది. ఆకర్షణ సిద్ధాంతం అనే ఆలోచన ఈ పుస్తకానికి ప్రాణం. మనం ఏది బలంగా ఆలోచిస్తామో… ఏది మనసారా కోరుకుంటామో అది మన జీవితంలోకి వస్తుందని ఈ సిద్ధాంతం చెబుతుంది. 2006లో విడుదలైన ఈ పుస్తకం తెలుగులో రహస్యం పేరుతో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కాపీలు అమ్ముడైంది. 50 భాషల్లో అందుబాటులో ఉంది.
సహనం వందే: పుస్తకంలోని ప్రధాన సిద్ధాంతం ఆకర్షణ శక్తి. దీని గురించి చెప్పండి.
అప్పలనాయుడు: నేను ఎప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలని నమ్ముతాను. ఆకర్షణ సిద్ధాంతం అదే చెబుతుంది. మనం మంచి ఆలోచిస్తే మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయాల్లో కూడా ఇది నిజమే. నేను ప్రజల కోసం ఏదైనా మంచి చేయాలనే తపనతో ఉండగా అటువంటి అవకాశాలు నిజంగానే దొరికాయి.

సహనం వందే: పుస్తకంలో చెప్పిన మూడు దశలు – అడగండి, నమ్మండి, స్వీకరించండి. ఇవి మీ జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చాయి ఒక ఉదాహరణ చెబుతారా?
అప్పలనాయుడు: అవును ఈ మూడు దశలు నా జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చాయి. ఉదాహరణకు ఈసారి ఎలాగైనా చట్టసభల్లో ప్రవేశించాలని గట్టిగా నమ్ముకున్నాను. అది సాధ్యం అవుతుందని నిశ్చయించుకున్నాను. ఆ ప్రకారం కలలుగన్నాను. అనేకమంది నన్ను నిరాశపరిచారు. కానీ నేను ఎన్నడూ నిరాశ పడలేదు. అడ్డంకులు వచ్చినప్పటికీ నేను అనుకున్నది సాధించగలిగాను. చంద్రబాబు నాయుడు, లోకేశ్ ల ఆశీర్వాదాలతో ఎంపీ అయ్యాను. నా సానుకూల దృక్పథమే నన్ను నడిపించింది.
సహనం వందే: గత ఎన్నికల్లో మీరు ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాన్ని కోరుకున్నారు. కానీ అది బీజేపీకి వెళ్లిపోయింది. ఆ సమయంలో మీరు ఏమనుకున్నారు?
అప్పలనాయుడు: అయినప్పటికీ నేను విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎలాగైనా నాకు ఏదో రూపంలో అవకాశం వస్తుందని నమ్ముకున్నాను. హైదరాబాద్ వచ్చి నాలుగైదు రోజు ఉండి కుటుంబంతో సరదాగా గడిపి వెళ్లిపోయాను. ఆ తర్వాత అద్భుతం జరిగింది. నా విశ్వాసం… నేను పెట్టుకున్న నమ్మకం అనుకున్న దానికంటే పెద్ద అవకాశమే నన్ను వరించింది. ఏకంగా విజయనగరం ఎంపీ టికెట్ నాకు దక్కింది.
సహనం వందే: గెలిచిన వెంటనే అపాయింట్మెంట్ లేకుండా ప్రధానిని ఎలా కలిశారు?
అప్పలనాయుడు: గెలిచిన వెంటనే తిరుపతి ప్రసాదం తీసుకొని ప్రధాని ఇంటికి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ లోనికి అనుమతించలేదు. ‘ఎంపీగా గెలిచాను. మోడీ గారికి తిరుపతి ప్రసాదం ఇస్తాను’ అని చెప్పాను. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని ప్రధాని కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఏం అద్బుతం జరిగిందో ఏమో నాకు తెలియదు గానీ ప్రధానమంత్రి పిలిపించారు. తిరుపతి ప్రసాదం ఆయన చేతిలో పెట్టాను. ఐదు నిమిషాలు నాతో మాట్లాడారు. నేను నమ్ముకున్నా… అది జరిగింది అంతే. ఇదే సీక్రెట్ పుస్తకం మహిమ.
సహనం వందే: కృతజ్ఞత అనే భావనను ఈ పుస్తకం ప్రాధాన్యతనిస్తుంది. మీరు ప్రతిరోజూ కృతజ్ఞతను ఎలా సాధన చేస్తారు? అది మీ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు తెచ్చింది?
అప్పలనాయుడు: నేను ప్రతిరోజూ ఉదయం లేవగానే నాకు లభించిన అవకాశాలకూ, నాకు సహకరించిన ప్రజలకూ కృతజ్ఞత చెబుతాను. ఇది నాకు వినమ్రతను నేర్పింది. కృతజ్ఞత భావం మనసులో ఉంటే అహంకారం తక్కువగా ఉంటుంది, ఇతరుల కష్టాలు కూడా అర్థం చేసుకోవచ్చు.
సహనం వందే: విజువలైజేషన్ – లక్ష్యాలను మనసులో స్పష్టంగా ఊహించుకోవడం. మీరు ఈ పద్ధతిని పాటించారా? ఏ సందర్భంలో ఇది ఫలితాన్ని ఇచ్చిందని అనిపించింది?
అప్పలనాయుడు: ఖచ్చితంగా పాటించాను. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, ప్రజా సభల్లో ప్రసంగిస్తున్న దృశ్యాన్ని ముందుగానే ఊహించుకున్నాను. ఆ ఊహలు నాకు ఆత్మవిశ్వాసం ఇచ్చాయి. ఆత్మవిశ్వాసం ఉన్నవారిని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. ఆ విశ్వాసమే నాకు విజయాన్ని తెచ్చింది.
సహనం వందే: ఈ పుస్తకాన్ని మీరు ఎన్నిసార్లు చదివారు?
అప్పలనాయుడు: ఇప్పటివరకు ఈ పుస్తకాన్ని వందసార్లు చదివాను. ఎన్ని సార్లు చదివినా ప్రతిసారీ ఆ పుస్తకం నాకు కొత్త అనుభూతి ఇస్తుంది. ద సీక్రెట్ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లోని బీరువాలో చూశాను.