- ఆచార్య ఎన్‌జీ రంగా వీసీపై ఫిర్యాదులు
- విచారణ చేయాలని గవర్నర్ కు విజ్ఞప్తి
- 500 కోట్ల నిధులను డ్రా చేశారని ఆరోపణలు
- ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
సహనం వందే, గుంటూరు:
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అవినీతికి నిలయంగా మారిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వీసీగా వ్యవహరిస్తున్న వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నారని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓ ప్రొఫెసర్ స్వయంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు వర్సిటీలో జరుగుతున్న చీకటి కార్యకలాపాలకు అద్దం పడుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ పాలక మండలిని విస్మరించి కోరం లేకుండానే రెండు సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పాలనా లోపం… నిధుల గోల్ మాల్
ఆర్థిక కమిటీని కూడా ఏర్పాటు చేయకుండా నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా రూ.500 కోట్ల వరకు నిధులను డ్రా చేశారని ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రంగా మారింది. వర్సిటీలో జరిగే సివిల్ పనుల నిమిత్తం కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు జరుగుతున్నాయని, ఈ అక్రమాలన్నీ వీసీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు చూస్తుంటే విశ్వవిద్యాలయం నిధులు అక్రమార్కుల జేబుల్లోకి మళ్లుతున్నాయన్న అనుమానం కలుగుతోంది.
లంచాల బదిలీలు… బెదిరింపుల పర్వం
ఉద్యోగుల బదిలీలు కూడా అవినీతికి వేదికయ్యాయి. ప్రాధాన్య పోస్టుల కోసం డబ్బు, బంగారం, విలువైన బహుమతులు డిమాండ్ చేస్తున్నారని, ఇచ్చిన వారికి మాత్రమే మంచి స్థానాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బదిలీ కోసం లంచం అడిగారని, ముడుపుల సొమ్ముతో వీసీ కర్నూలులో కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారని ప్రొఫెసర్ తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారని ఆరోపించడం ఈ వ్యవహారం ఎంతటి మానసిక భీభత్సాన్ని సృష్టిస్తోందో తెలియజేస్తుంది. తాత్కాలిక వీసీ పర్యటనల వివరాలు గవర్నర్‌కు తెలియజేయాలన్న నిబంధనను కూడా వీసీ పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విచారణ అనివార్యం… గవర్నర్‌కు విజ్ఞప్తి
ఈ అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకుని వీసీని పదవి నుంచి తొలగించాలని, దీనిపై ఏసీబీ, విజిలెన్స్, ఈడీ వంటి కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని సదరు ప్రొఫెసర్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అక్రమ బదిలీలు, వాహనాల పేరుతో నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు విశ్వవిద్యాలయం పాలనపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఫిర్యాదును ఎంత తీవ్రంగా పరిగణిస్తుందన్న దానిపైనే వర్సిటీ భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది.