- సక్రమ పంపిణీలో వ్యవసాయశాఖ ఫెయిల్
- రుణమాఫీ అందజేయడంలో ప్లానింగ్ లేదు
- యూరియా సరఫరాలో వ్యూహాత్మకత కరువు
- పరిస్థితులను చక్కదిద్దడంలో ఘోర వైఫల్యం
- స్పెషల్ ఆఫీసర్లను ఎందుకు నియమించలేదు?
- కొందరు మార్క్ ఫెడ్ అధికారుల ఇష్టారాజ్యం
- అటువంటి వారిని నియంత్రించడంలో విఫలం
- సీఎంకి చెడ్డ పేరు తెచ్చేలా అంతర్గత కుట్రలు
సహనం వందే, హైదరాబాద్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వంలో ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వ్యవసాయశాఖలో ఎవరైనా కోవర్టులుగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ పండితులు. అప్పట్లో రుణమాఫీ విషయంలోనూ… ఇప్పుడు యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ యంత్రాంగ నిర్లక్ష్యమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ సర్కారును ఇరుకున పెట్టే విధంగా కొందరు వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి ఇటువంటి కుట్రలకు తెరలేపినట్లు సెక్రటేరియట్ వర్గాలు కోడై కోస్తున్నాయి. ఏ శాఖ నుంచి కూడా ప్రభుత్వంపై ఇంత దారుణంగా వ్యతిరేకత రాలేదు. కేవలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని రుణమాఫీ, యూరియా వల్లనే ప్రభుత్వం రైతుల్లో బద్నాం అవుతుంది. ఈ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఈ రెండు ముఖ్య అంశాల్లోనే ఘోరంగా విమర్శలు ఎదుర్కొంది.
రుణమాఫీ పంపిణీలో వ్యూహం కరువు…
రుణమాఫీ అమలులో వ్యవసాయ శాఖ పూర్తి అసమర్థత చూపింది. రూ. 2 లక్షల వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా లక్ష మంది రైతులు ఇంకా ఎదురు చూస్తున్నారు. రూ. 31 వేల కోట్లు మాఫీ చేసినట్లు చెప్పుకున్నా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్లానింగ్ లేకుండా అమలు చేయడంతో రైతులు మోసపోయారు. ప్రతిపక్ష పార్టీలు ఈ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులను రైతులకు

ఎలా పంపిణీ చేయాలన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది అధికారులే. ఆ ప్రకారం మార్గదర్శకాలు ఖరారు చేయాల్సింది కూడా వ్యవసాయ శాఖనే. ఇక్కడ ఎవరైనా కోవర్ట్ ఆపరేషన్ చేశారా అన్న విమర్శలు కూడా ఉన్నాయి. భారీగా నిధులు ఖర్చు చేస్తున్న సమయంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా విమర్శలు రావడాన్ని ఆమోదించరు. కానీ రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించింది అధికారులేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
యూరియా సరఫరాలో పర్యవేక్షణ లోపం…
తెలంగాణలో కీలకమైన ఖరీఫ్ సీజన్ లో యూరియా కొరత రైతులను ఆగ్రహానికి గురి చేస్తోంది. అనేక చోట్ల రాత్రనకా పగలనకా యూరియా కోసం దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. కేంద్రం 9.8 లక్షల మెట్రిక్ టన్నులు మంజూరు చేసినా 2.98 లక్షల టన్నుల లోటు ఏర్పడింది. ఈ లోటును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికను రచించడంలో వ్యవసాయశాఖ, మార్క్ ఫెడ్ ఘోరంగా విఫలం అయ్యాయని విమర్శలు ఉన్నాయి.
అనేక చోట్ల బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ ఎంత అవసరమో ఆ ప్రకారం పంపిణీ చేపట్టకుండా… వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను ఎందుకు నియమించలేదని పలువురు మండిపడుతున్నారు.
స్థానిక ఎన్నికలలో పరిస్థితి ఏంటి?
ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు రేవంత్ రెడ్డిని భయపెడుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉండటంతో ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడుతోంది. కేంద్రం ఆమోదం ఇవ్వకుండా ఆపుతోందని రేవంత్ విమర్శిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఆప్షన్లు చూడకుండా కమిటీలు వేస్తోంది. గ్రామాల్లో ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు జరిపితే సగం సీట్లు కూడా గెలవలేమని సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ అయోమయం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది.