18 వేల ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణం – ఈడీ దర్యాప్తులో వెలుగులోకి అక్రమాలు

  • ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఆర్ఐ ఫోర్జరీ పత్రాలు
  • రాయబార కార్యాలయాలతో నకిలీ సర్టిఫికెట్లు
  • అమెరికా నోటరీ అధికారుల నకిలీ స్టాంపులు
  • ఇలా అనేక పద్ధతుల్లో ఫోర్జరీ పత్రాలు తయారీ
  • తెలంగాణలో ఇలా ఏమైనా జరిగిందా?
  • ఆరా తీస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ?

సహనం వందే, న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో జరిగిన భారీ కుంభకోణం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఎన్ఆర్ఐ కోటా పేరుతో నకిలీ పత్రాలతో వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకున్నట్లు తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ కుంభకోణంలో దాదాపు 18 వేల మంది విద్యార్థులు ఫోర్జరీ సర్టిఫికెట్లతో వైద్య కళాశాలల్లో చేరినట్లు తేలింది. ఈ దారుణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టి ఈ మోసాన్ని బట్టబయలు చేసింది.

నకిలీ పత్రాలతో దందా…
వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా కింద సీట్ల కేటాయింపు పేరుతో భారీ మోసం జరిగింది. నకిలీ ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లతో విద్యార్థులు సీట్లు సంపాదించారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాల సాయంతో నిర్వహించిన ఈ తనిఖీల్లో దాదాపు 18 వేల మంది నకిలీ పత్రాలతో ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినట్లు తేలింది. ఈ కుంభకోణం వెనుక మెడికల్ కళాశాలలు, ఏజెంట్ల బృందం ఉన్నట్లు స్పష్టమైంది. ఈ మాఫియా రాయబార కార్యాలయాల పేరుతో నకిలీ ధ్రువీకరణలు, కుటుంబ సభ్యుల పేరిట ఫోర్జరీ పత్రాలు సృష్టించి విద్యార్థులకు సీట్లు కట్టబెట్టింది.

రూ.12 కోట్ల ఆస్తుల జప్తు…
ఈ కుంభకోణంలో భాగంగా ఈడీ అధికారులు ఒక ప్రైవేటు వైద్య కళాశాలకు సంబంధించిన రూ.6.42 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడిన కొన్ని కళాశాలలు, వ్యక్తులకు చెందిన రూ.12.33 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ దర్యాప్తులో అమెరికా నోటరీ అధికారుల నకిలీ స్టాంపులు, ఫేక్ సర్టిఫికెట్లు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఈ మోసం ద్వారా కొందరు ఏజెంట్లు కోట్ల రూపాయలు సంపాదించినట్లు వెల్లడైంది.

ఎన్ఆర్ఐ కోటా దుర్వినియోగం…
ఎన్ఆర్ఐ కోటా నిబంధనల ప్రకారం… ఈ కోటాలో సీట్లు పొందే విద్యార్థుల ఫీజులను వారి ఫీజును ఎన్ఆర్ఐ బంధువులు చెల్లించాలి. కానీ ఈడీ దర్యాప్తులో ఈ నిబంధనలు ఉల్లంఘించబడినట్లు తేలింది. చాలా సందర్భాల్లో ఫీజులు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు చెల్లించలేదని, బదులుగా ఏజెంట్లు లేదా కళాశాలలే ఈ బాధ్యత తీసుకున్నట్లు బయటపడింది. కొందరు నిజమైన ఎన్ఆర్ఐ అభ్యర్థుల పేర్లను దుర్వినియోగం చేసి, ఏజెంట్లు డబ్బులు చెల్లించి సీట్లు కొనుగోలు చేసినట్లు కూడా వెల్లడైంది.

మెడికల్ కాలేజీలపై దాడులు
ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈడీ అధికారులు పలు వైద్య కళాశాలలపై దాడులు చేసి విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీ ఎన్ఆర్ఐ పత్రాలు, అమెరికా నోటరీ స్టాంపులు బయటపడ్డాయి. అయితే ఈ అక్రమాలపై పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈడీ ఆరోపించింది. ఈ నిర్వాకంపై స్థానిక అధికారుల నిర్లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో ఏమైనా ఇలాంటి అక్రమాలు జరిగాయా అన్న అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి?
ఈ కుంభకోణం వైద్య విద్య వ్యవస్థలోని లోటుపాట్లను బట్టబయలు చేసింది. నకిలీ పత్రాలతో సీట్లు దక్కించుకున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈడీ దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతుండగా, ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న కళాశాలలు, ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *