- కేంద్ర హోం మంత్రి అమిత్ భావోద్వేగం
- సోహ్రబుద్దీన్ కేసుతో ఇతర రాష్ట్రాల్లో నివాసం
- 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై షా సమర్థన
సహనం వందే, న్యూఢిల్లీ:
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో తన రెండేళ్ల గుజరాత్ బహిష్కరణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి ఆఫ్తాబ్ అలం ఆందోళన వ్యక్తం చేయడంతో తానే స్వచ్ఛందంగా రాష్ట్రం విడిచి వెళ్లానని షా స్పష్టం చేశారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాలనలో హోం మంత్రిగా ఉన్న షా… తన పదవీ ప్రభావం సాక్ష్యాలపై పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడారు
బెయిల్ ఆలస్యం… చరిత్రలోనే తొలిసారి
తన బెయిల్ పిటిషన్‌పై విచారణ రెండేళ్ల పాటు సాగడం చరిత్రలోనే అరుదైన సంఘటన అని ఆయన విమర్శించారు. గతంలో ఏ బెయిల్ పిటిషన్‌కూ ఇంత ఆలస్యం జరగలేదని, సాధారణంగా 11 రోజుల్లోనే బెయిల్ విచారణ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. సీబీఐ సమన్లు అందిన వెంటనే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత కేసు పూర్తిగా కొట్టివేసే వరకూ ఏ రాజ్యాంగ పదవినీ స్వీకరించలేదని షా తెలిపారు.
130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు షా సమర్థన
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును షా గట్టిగా సమర్థించారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులను తొలగించే ఈ బిల్లు రాజ్యాంగ నైతికతను, ప్రజా విశ్వాసాన్ని పరిరక్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు అధికార, ప్రతిపక్ష నాయకులకు సమానంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే కేసుల్లో 30 రోజులకు మించి నిర్బంధంలో ఉన్న వారిని తొలగించే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించినప్పటికీ, షా దీన్ని ఆమోదిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయ కక్షతో ఆనాడు కేసు…
ప్రస్తుతం ఈ బిల్లును 31 మంది సభ్యులతో కూడిన ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. కమిటీ ఈ బిల్లును సమగ్రంగా పరిశీలించి సిఫార్సులు చేసిన తర్వాత ఓటింగ్‌కు వస్తుంది. ఈ బిల్లు రాజకీయ వివాదంగా మారినప్పటికీ, షా తన నిర్ణయాలను, ప్రభుత్వ వైఖరిని ధీటుగా సమర్థించారు. సోహ్రబుద్దీన్ కేసును తనపై రాజకీయ కక్షతో నమోదు చేశారని, పూర్తిగా నిర్దోషినని కోర్టు తీర్పు ద్వారా నిరూపితమైందని ఆయన గుర్తు చేశారు.
నైతికత పాఠాలెవరి నుంచి?
ప్రతిపక్షాలు తనకు నైతికతపై పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందని షా వ్యంగ్యంగా అన్నారు. సీబీఐ సమన్లు అందిన వెంటనే రాజీనామా చేసి కేసు పూర్తయ్యే వరకూ ఎలాంటి పదవీ బాధ్యతలు స్వీకరించకుండా ఉన్న తన చరిత్రను ఆయన ప్రస్తావించారు. ఈ బిల్లు ద్వారా రాజకీయ నాయకులపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని షా స్పష్టం చేశారు.