‘సీఎంలు వాళ్లు.. రోడ్లపై నేను’ – వి. హనుమంతరావు భావోద్వేగం

  • కేసీఆర్, చంద్రబాబు నా దగ్గరే పని చేశారు
  • సీఎం అవకాశం వచ్చినా తీసుకోలేదని వెల్లడి

సహనం వందే, కరీంనగర్:
‘నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్, చంద్రబాబు నా దగ్గరే పని చేశారు. వాళ్లు సీఎంలు అయ్యారు. నేను మాత్రం రోడ్లమీద తిరుగుతున్నాన’ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు రెండుసార్లు వచ్చినప్పటికీ ఆ పదవి తీసుకోలేదని చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన జనహిత పాదయాత్రలో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పార్టీ మారని నేత
పదవుల కోసం పార్టీలు మారిన నేతలు చాలామంది ఉన్నారని, కానీ తాను మాత్రం చావు దాకా కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఎన్ని పదవులు ఆశ చూపినా, పార్టీని విడిచిపోవాలనే ఆలోచన రాలేదని వీహెచ్ గట్టిగా చెప్పారు.

బీజేపీపై దూసుకుపోయిన వీహెచ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో హిందువులే ఉండాలని చెబుతోందని ఆయన విమర్శించారు. ‘మరి ముస్లింలు, క్రైస్తవులు ఎక్కడికి పోవాలి?’ అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ, ఎన్నికల సంఘం అన్నీ బీజేపీ జేబుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. బీహార్లో లక్షలాది ఓట్లు తొలగించి గెలుపు సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

బీసీ రిజర్వేషన్ల హామీ
బీసీలకు న్యాయం చేయగల పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని వీహెచ్ నొక్కిచెప్పారు. కామారెడ్డిలో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పక ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పూర్తి రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.

మహిళల కోసం ఫ్రీ బస్సు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల ఫ్రీ బస్సు పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఈ పథకం ద్వారా మహిళలు తమ పిల్లలు, తల్లులు, కుటుంబ సభ్యుల దగ్గరికి సులభంగా చేరుకుంటున్నారని చెప్పారు.

రాజీవ్ గాంధీ ప్రస్తావన
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పాలనలోనే టెక్నాలజీ అభివృద్ధి పుంజుకుని దేశం ముందుకు వెళ్లిందని గుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది కూడా రాజీవ్ గాంధీ హయాంలోనే అని వీహెచ్ ఉద్ఘాటించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *