- హిందీ తప్ప తెలుగు మాట్లాడడానికి నామోషీ
- గ్రామాల్లో విస్తరించినప్పటికీ అక్కడా అదే తీరు
- మరోవైపు స్థానిక వ్యాపారులపై ఆధిపత్యం
- మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి కారణాలు
- ఉత్తరాధిపత్యం పెరుగుతోందన్న ‘సౌత్ సేన’
సహనం వందే, హైదరాబాద్:
శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని… సొంత తెలివి తేటలతో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మార్వాడీలు… ఇన్నేళ్ల కాలంలో తెలుగు భాష ఎందుకు నేర్చుకోలేదు? గ్రామాలు మొదలు హైదరాబాద్ వరకు ఎక్కడ చూసినా వాళ్ళెవరూ తెలుగు నేర్చుకోరు… మాట్లాడరు. వాళ్ల కోసం మనం హిందీ నేర్చుకోవాలి తప్ప… మార్వాడీలు మాత్రం తెలుగు నేర్చుకోరు. మనకు వచ్చినా రాకున్నా వాళ్ల భాషలోనే మాట్లాడాలి.

తెలుగు భాషపై మార్వాడీ ద్వేషం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక ప్రజల భాషా, సంస్కృతిని ఏమాత్రం ఇముడ్చుకోని జాతి మార్వాడీ. అలాంటివారు ఇక్కడ ఆధిపత్యం చేస్తే ఎవరు ఊరుకుంటారు? గో బ్యాక్ మార్వాడి ఉద్యమం వెనుక ఇలాంటి కారణాలు అనేకం ఉన్నాయని సౌత్ సేన నాయకులు రవి, శ్రీనివాస్, కె.రమేష్ (పృథ్వి), శ్రీకాంత్, జగదీష్ విశ్లేషిస్తున్నారు.
స్థానికులను తొక్కేస్తూ వ్యాపారాలా?
ఒక జాతి ఆధిపత్యాన్ని మరో జాతి ఏనాడూ ఆమోదించదని ప్రపంచ చరిత్ర మనకు ఒక స్పష్టమైన పాఠం చెబుతోంది. ఒకే దేశంలో ఉన్నా… పక్కపక్కనే నివసించినా… ఆధిపత్య ధోరణి ఎక్కడ కనిపించినా అక్కడి ప్రజలు పోరాటానికి సిద్ధపడతారు. ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడిన సందర్భాన్ని మనం చూశాం. తమిళనాడులో హిందీ వ్యతిరేక పోరాటం చూశాం. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలో మరో రూపంలో కనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం కూడా ఇదే నేపథ్యం నుంచి పుట్టుకొచ్చింది. ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న మార్వాడీలు స్థానిక వ్యాపారులను, ఇతర వర్గాలను అణగదొక్కుతున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. తమ వ్యాపార నైపుణ్యాలతోనే ముందుకు వెళ్తున్నామని మార్వాడీలు వాదిస్తున్నా, అది స్థానిక వ్యాపారుల తెలివిని తక్కువ చేసి మాట్లాడడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కారణం ఏమైనప్పటికీ, స్థానికులను తొక్కేసి ముందుకు సాగడాన్ని ఇక్కడి ప్రజలు ఆమోదించే పరిస్థితులు కనిపించడం లేదు.
ఉద్యమానికి పలు కోణాలు…
తెలంగాణలో మార్వాడీల వ్యాపార విస్తరణ కేవలం ఆర్థిక సమస్యగానే కాకుండా సాంస్కృతిక సమస్యగా కూడా పరిణమించింది. ఇక్కడ నివసిస్తూ ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలైన బతుకమ్మ, బోనాలు వంటి వాటిని అగౌరవంగా చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రతిగా భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉందని మార్వాడీలు, వారికి మద్దతుగా పలువురు నేతలు వాదిస్తున్నారు. పెట్టుబడులు తెస్తున్న మార్వాడీలను వెళ్లగొట్టడం సరికాదని వారు చెబుతున్నారు.
అన్ని వ్యాపారాల్లో చొరబాటు…
మార్వాడీలు సాంప్రదాయకంగా కిరాణా, నగల వ్యాపారాలు చేసినప్పటికీ… కాలంతోపాటు అన్ని రంగాల్లోకి అడుగుపెట్టారు. ఎలక్ట్రానిక్స్, చెప్పులు, శానిటరీ, హార్డ్‌వేర్, గ్రానైట్ ఇలా అన్ని వ్యాపారాల్లోనూ వారి ఆధిపత్యం కనిపిస్తోంది. వారి మరో బలమైన అంశం సరఫరా గొలుసును తమ నియంత్రణలో ఉంచుకోవడం. హోల్‌సేల్ నుంచి రిటైల్ వరకు సప్లై చైన్ వారి చేతుల్లోనే ఉంటుంది. దీంతో తక్కువ ధరకు వస్తువులను తెచ్చుకుని, తమ లాభాల మార్జిన్ చూసుకుని అమ్ముతారు. ఫలితంగా స్థానిక వ్యాపారులకు ఈ స్థాయిలో తక్కువ ధరలకు వస్తువులు లభించవు. అందుకే వారితో పోటీ పడలేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. అలాగే తమ వ్యాపారాల్లో సొంత కమ్యూనిటీకి చెందిన వారినే నియమించుకోవడం వల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు దక్కడం లేదని సౌత్ సేన నాయకులు మండిపడుతున్నారు.
రాజకీయ రంగు పులుముకున్న ఉద్యమం…
మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి ఇప్పుడు మతం, రాజకీయ రంగు కూడా అంటుకుంది. ఈ ఉద్యమం వెనుక రాజకీయ స్వార్థం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ వంటివారు ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు హిందూ సమాజాన్ని విడదీయడానికి ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు. మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్నారని, రాష్ట్ర సంపదను దోచుకోవట్లేదని ఆయన వాదించారు. పెట్టుబడులు తెచ్చే వారిని వెళ్లగొట్టడం సరికాదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆర్థికంగా మొదలైన ఈ ఉద్యమం రాజకీయ రంగు పులుముకుని మరింత సంక్లిష్టంగా మారింది.