డబ్బుల్లో బాబు… కేసుల్లో రేవంత్ – దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్

  • ముఖ్యమంత్రుల్లో అత్యధిక ఆస్తి బాబుకే
  • రూ. 931 కోట్ల ఆస్తులతో చంద్రబాబు టాప్
  • దేశంలో అత్యధిక కేసులున్న సీఎం రేవంత్
  • ఆయనపై 89 కేసులు… తర్వాత స్టాలిన్
  • రేవంత్ పోరాటాలే నాయకుడిని చేశాయి
  • ఏడీఆర్ నివేదికలో విస్తుపోయే అంశాలెన్నో!
  • పేద సీఎంలలో మమత, ఒమర్, పినరయి

సహనం వందే, హైదరాబాద్:
తెలుగు రాష్ట్రాల సీఎంలు దేశంలో మొదటి స్థానాల్లో ఉన్నారు. ఒకరు డబ్బుల్లో, మరొకరు కేసుల్లో ముందున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిలియనీర్ గా టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన ఆస్తి రూ. 931 కోట్లు. అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె ఆస్తి కేవలం రూ. 15 లక్షలు. భారతదేశంలోని 30 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఆస్తులు, కేసుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. గత ఎన్నికల్లో వాళ్ళు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. వివరాల కోసం ఈ లింక్ https://adrindia.org/ క్లిక్ చేయండి.

ఆస్తుల్లో రేవంత్ ఏడో స్థానం…
చంద్రబాబు దేశంలో అత్యంత ధనిక సీఎంగా కొనసాగుతున్నారని నివేదిక తెలిపింది. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా కార్పొరేట్ దిగ్గజం ఆస్తులకు సరిపోతుంది. ఆయన తర్వాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు ఉన్నారు. ఆయన ఆస్తులు రూ. 332 కోట్లు. వీరిద్దరే బిలియనీర్ ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు రూ. 1632 కోట్లుంటే… అందులో సగానికి పైగా చంద్రబాబు వద్దనే రూ. 931 కోట్లు ఉండడం గమనార్హం. ఆస్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 30 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు.

సొంత ఇల్లు లేని మమతా బెనర్జీ…
మమతా బెనర్జీ ఆస్తుల విలువ కేవలం రూ. 15 లక్షలు మాత్రమే. ఇందులో ఆమె చేతిలో రూ. 69,000 నగదు, బ్యాంకులో రూ. 13.5 లక్షల బ్యాలెన్స్, 9 గ్రాముల బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయని నివేదిక తెలిపింది. ఆమె పేరు మీద ఇల్లు కాని, భూమి కాని ఏదీ లేదు. ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ సాధారణ మధ్య తరగతి మహిళలా ఆమె జీవిస్తున్నారని నివేదిక తెలిపింది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ఆస్తుల విలువ సుమారు రూ. 30.4 లక్షలుగా ఉండేది. కాని తరువాతి సంవత్సరాల్లో అది తగ్గింది. ఆమె తర్వాత పేద ముఖ్యమంత్రుల్లో రెండో స్థానంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. ఆయన వద్ద రూ. 55 లక్షల ఆస్తులు ఉండగా… మూడో స్థానంలో నిలిచిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వద్ద రూ. 1 కోటి ఆస్తులు ఉన్నాయి.

89 కేసులతో రేవంత్ టాప్…
దేశంలో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఆయనపై ఏకంగా 89 కేసులు నమోదైనట్టు ఏడీఆర్ వెల్లడించింది. గత ప్రభుత్వంపై పోరాటాల వల్లనే ఇన్ని కేసులు నమోదయ్యాయి. ఆ పోరాటాల ఫలితమే ముఖ్యమంత్రి స్థానం. తర్వాత రెండో స్థానంలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై 47 కేసులు నమోదు కాగా… మూడో స్థానంలో నిలిచిన చంద్రబాబుపై 19 కేసులు ఉన్నాయి. కేసుల్లో టాప్ త్రీ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఏడీఆర్ నివేదికలోని ముఖ్యంశాలు…

  • 12 మంది ముఖ్యమంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి.
  • 10 మంది ముఖ్యమంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.‌ అంటే వాళ్లపై హత్యాయత్నం, కిడ్నాపింగ్, లంచం వంటి కేసులు ఉన్నాయి.
  • మొత్తం దేశంలోని ముఖ్యమంత్రుల్లో 40% సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మిగిలిన 60 శాతం మందికి క్లీన్ చిట్ ఉంది.
  • ఇద్దరు ముఖ్యమంత్రులు బిలియనీర్లు.
  • ముఖ్యమంత్రులలో ఇద్దరు మహిళలు.
  • ముఖ్యమంత్రులలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. త్రిపుర సీఎం మాణిక్ సాహా త్రిపుర మెడికల్ కాలేజీలో డెంటల్ సర్జన్ ప్రొఫెసర్ గా పనిచేశారు. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఆయుర్వేద వైద్యుడు.
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వారు 8 మంది ఉండగా అందులో చంద్రబాబు ఒకరు. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన వారు ఒకరు, ఇంటర్ మాత్రమే చదివిన వారు ముగ్గురు సీఎంలు ఉన్నారు.
  • 41-50 మధ్య ఏళ్ళ వయస్సున్న ముఖ్యమంత్రులు 8 మంది ఉండగా… 71-80 ఏళ్ల అత్యధిక వయసు కలిగిన సీఎంలు ఆరుగురు ఉన్నారు. అత్యధికంగా 12 మంది 51-60 ఏళ్ళ వయసు వారు ఉన్నారు.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *