- గెలిపించిన పార్టీల్నే ఓడించలేని వ్యూహకర్త
సహనం వందే, పాట్నా:
రాజకీయ వ్యూహాలతో ఎన్నో పార్టీలను అధికార గద్దెలపై కూర్చోబెట్టిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సొంత పార్టీని నడపలేక నలిగిపోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, శివసేన, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలకు విజయ మార్గాలు చూపిన ఈ వ్యూహకర్త… బీహార్‌లో తన జన్ సురాజ్ పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షిస్తున్నారు. కానీ ఆయన గత విజయాలు ఇప్పుడు ఓటమి నీడల్లో కనుమరుగవుతున్నాయి.
అధికార కూటముల సవాళ్లు…
అక్టోబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి, కాంగ్రెస్-ఆర్జేడీ ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ రెండు బలమైన కూటముల మధ్య జన్ సురాజ్ పార్టీ చిన్న చిన్న అడుగులతో పోటీలో నిలవాలని చూస్తోంది. అయితే అంగబలం, ఆర్థిక బలం లేని పీకే పార్టీ ఈ రాజకీయ రణరంగంలో నిలబడలేక తడబడుతోంది. గతంలో ఆయన వ్యూహాలతో అధికారం చేపట్టిన పార్టీలే ఇప్పుడు ఆయనకు సవాల్‌గా నిలుస్తున్నాయి.
వ్యాఖ్యలతో వివాదం…
సొంత పార్టీ బలహీనతను దాచుకునేందుకో ఏమో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. రాహుల్ గాంధీని బయటి వ్యక్తిగా, మోడీ హిందూత్వ సిద్ధాంతం బలం కోల్పోతోందని వ్యాఖ్యానిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయనకు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడతాయన్నది ప్రశ్న. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ వివాదం కూడా పీకేకు మరో తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకెళతారన్నది ఆసక్తికరం.
పరువు కాపాడుకునే పోరాటం…
గత విజయాల నీడలో జన్ సురాజ్ పార్టీని నడిపిస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు ఈ ఎన్నికలు కీలకం. కనీస సీట్లైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ పార్టీలకు విజయ రహస్యాలు చెప్పిన వ్యూహకర్త, ఇప్పుడు తన సొంత పార్టీ కోసం విజయం సాధించలేక తలపట్టుకుంటున్నారు. ఈ ఎన్నికలు ఆయన రాజకీయ భవిష్యత్తును ఎలా మలుస్తాయో చూడాలి.