తమిళనాడు వర్సెస్ తెలంగాణ – ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సౌత్ మధ్య వార్

  • దక్షిణాదిలో రెండు జాతీయ పార్టీల చిచ్చు
  • తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు ముడి
  • ఇండియా బ్లాక్ తరఫున సుదర్శన్ రెడ్డి
  • ఎన్డీఏ తరఫున తమిళనాడు రాధాకృష్ణన్
  • కేంద్రంలో మరోసారి కీలకంగా మారిన జగన్

సహనం వందే, హైదరాబాద్:
ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో రెండు జాతీయ పార్టీల తరఫు కూటములు దక్షిణాదిని రాజకీయ వేదికగా తయారు చేసుకున్నాయి. తమిళనాడు (టి), తెలంగాణ (టి) రాష్ట్రాలను ఈ ఎన్నికల్లో భాగస్వామ్యులను చేశాయి. ఎన్డీఏ కూటమి తరపున తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. దక్షిణాది కేంద్రంగా ఉత్తరాది పెద్దలు ఉపరాష్ట్రపతి ఎన్నికల రాజకీయం మొదలుపెట్టారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్కడ్‌ వ్యక్తిగత కారణాలతో ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.

దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాల అధికార పార్టీల మద్దతు సుదర్శన్ రెడ్డికే…
ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎన్డీఏ కూటమి తరుపున పోటీ చేస్తున్న రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వారు అయినప్పటికీ… దక్షిణాది రాష్ట్రాల నుంచి మాత్రం ఆయనకు దక్కే మద్దతు అంతంతే. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఆయన గెలిచే అవకాశం ఎక్కువే. కానీ దక్షిణాది ప్రాంతం నుంచి మాత్రం ఆయనకు మద్దతు లభించే పరిస్థితి లేదు. తమిళనాడు డీఎంకే, కేరళ లెఫ్ట్ ఫ్రంట్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ప్రభుత్వాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ఉన్నాయి.

జగన్ మద్దతు… ఇరకాటంలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర బీజేపీ నాయకత్వం నడిపిస్తోందా అన్న అనుమానం కలుగుతుంది.‌ బీజేపీకి ఏపీలో పెద్దగా రాజకీయ బలం లేదు. కానీ లోక్ సభ, రాజ్యసభలలో ఏపీ నుంచి ఎంపీల మద్దతు అంతా కీలక సమయాల్లో ఆ పార్టీకే దక్కుతోంది. ఇక్కడ చూస్తే కేంద్ర స్థాయి బీజేపీ నేతలకు ఏపీలో ప్రాంతీయ పార్టీల విషయంలో రాగద్వేషాలు పెద్దగా లేవని… ఉన్నవి రాజకీయ అవసరాలే అని బోధపడుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నపుడు 2022లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో వైసీపీ ఎటూ ఎన్డీయేకు తమ మద్దతు అని చెప్పేసింది. ఆనాడు ఎన్డీయే కూటమిలో లేని తెలుగుదేశం కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మరీ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు తమ సపోర్టు అని గొప్పగా చెప్పింది. అలా మొత్తం ఓట్లు బీజేపీకే వెళ్ళాయి. అపుడు వైసీపీ టీడీపీ మీద కొంత రుసరుసలాడింది. అయినా కూడా ఇద్దరూ కలసి జై బీజేపీ అనేశారు. కట్ చేస్తే నేడు విపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఎన్డీయేకు జై అంటోంది. ఈ పరిణామం అధికార టీడీపీ కూటమికి ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు.

వైసీపీకి కేంద్రంలో ఛాన్స్…
కేంద్రంలో తమ మద్దతుతో ఎన్డీయే ప్రభుత్వం ఉందని టీడీపీ గట్టిగా చెప్పుకుంటోంది. అయితే ఆ పార్టీ ఆశించినవి ఏవీ జరగడంలేదు. ముఖ్యంగా రాజకీయంగా జగన్ ని ఇబ్బంది పెట్టాలని అనుకున్న ప్రతీ సందర్భంలో కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇపుడు అనూహ్యంగా ఒక చాన్స్ వైసీపీకి ఉప రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేరుగా జగన్ కే ఫోన్ చేసి వైసీపీ మద్దతు అడిగారు. దానికి వైసీపీ సైతం సానుకూలంగానే స్పందించింది. అయితే ఈ మద్దతు బీజేపీకి మోదంగా ఉంటే టీడీపీకి ఇబ్బందిగానే ఉందని అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *