- ఉపరాష్ట్రపతి పోస్టుతో సౌత్ కి ఒరిగేదేంటి?
- నాడు వెంకయ్య ఉండటంవల్ల ఏమొచ్చింది?
- కీలకమైన కేంద్ర మంత్రి పదవులు ఉత్తరాదికే
- ప్రాధాన్యం లేని పోర్ట్ పోలియోలు దక్షిణానికి
- సౌత్ ఇండియాపై కొనసాగుతున్న వివక్ష
- దక్షిణాదిలో మొదలైన ఉత్తరాది వ్యతిరేకత
సహనం వందే, హైదరాబాద్:
భారత రాజకీయాలు ఎప్పుడూ ఉత్తర-దక్షిణ విభజనతో ముడిపడి ఉన్నాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో కూడా ఈ వివక్ష మరింత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉత్తరాదికి కీలకమైన మంత్రి పదవులు, ఆర్థిక సహాయాలు దక్కుతుండగా… దక్షిణాదికి ప్రాధాన్యం లేని పోర్ట్‌ఫోలియోలు, తక్కువ నిధులు లభిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణ రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ… రాజకీయంగా, ఆర్థికంగా వివక్షకు గురవుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఉపరాష్ట్రపతి పదవితో ఒరిగేదేమీ లేదు…
ఉపరాష్ట్రపతి పదవి దక్షిణాదికి ఇవ్వడం వల్ల ఆశించినంత ప్రయోజనం ఉండదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఉపరాష్ట్రపతిగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడు ఉన్నప్పటికీ, ఆయన పదవి కాలంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ లభించలేదనేది ఒక వాదన. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రాజధాని అమరావతి అభివృద్ధికి సరైన నిధులు కేటాయించకపోవడం వంటి సమస్యలు ఆయన హయాంలో కూడా కొనసాగాయి. ఈ పదవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడుతుందే తప్ప… ఆర్థిక లేదా అభివృద్ధి పరమైన ప్రయోజనాలు చేకూర్చడం లేదని విశ్లేషకుల అభిప్రాయం.
కీలక శాఖలు ఉత్తరాదికే…
కేంద్రంలో మంత్రుల ఎంపికలో కూడా ఈ వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోడీ 3.0 క్యాబినెట్‌లో దక్షిణ భారతదేశం నుంచి 13 మంది మంత్రులు ఉన్నారు, అయితే వారిలో నిర్మలా సీతారామన్ (ఆర్థిక శాఖ) మినహా చాలామందికి ప్రాధాన్యత లేని శాఖలు మాత్రమే దక్కాయి. కర్ణాటకకు చెందిన హెచ్.డి.కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ప్రహ్లాద్ జోషికి వినియోగదారుల వ్యవహారాల శాఖ వంటివి లభించాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రామ్మోహన్ నాయుడుకు విమానయాన శాఖ ఇచ్చారు. తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నప్పటికీ వారికి సాధారణ శాఖలే అప్పగించారు. అదే సమయంలో ఉత్తర భారతదేశానికి చెందిన మంత్రులకు హోమ్, రక్షణ, విదేశాంగ వ్యవహారాల వంటి కీలక శాఖలు దక్కాయి. తమకు ఓట్లు వేయని తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎటువంటి మంత్రి పదవులు లభించకపోవడం ఈ వివక్షకు మరో ఉదాహరణగా నిలుస్తోంది.
బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం…
కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో కూడా దక్షిణ రాష్ట్రాలపై వివక్ష కొనసాగుతోంది. దేశ జీడీపీ 30 శాతానికి పైగా దక్షిణాది రాష్ట్రాలదే అయినప్పటికీ… పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం పంపిణీలో వాటికి తక్కువ వాటా దక్కుతోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఒక్కటే రూ. 31,962 కోట్లు పొందుతుండగా, మొత్తం దక్షిణాది రాష్ట్రాలు (ఆంధ్రా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ) కలిపి రూ. 28,152 కోట్లు మాత్రమే పొందుతున్నాయి. ఈ వివక్షను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిలో తిరిగి కేవలం 42 పైసలు మాత్రమే వస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
జనాభా లెక్కల ఆధారంగా నిధుల కేటాయింపు
దక్షిణ రాష్ట్రాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది జనాభాను నియంత్రించినప్పటికీ, నిధుల కేటాయింపు జనాభా ఆధారంగా జరుగుతుండటం వల్ల నష్టపోతున్నాయి. పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం సమకూర్చుతున్నా, తక్కువ జనాభా ఉన్న కారణంగా నిధులు తక్కువగా పొందుతున్నాయి. మరోవైపు అధిక జనాభా ఉన్న ఉత్తర రాష్ట్రాలు పన్నుల రూపంలో తక్కువ సహకారం అందిస్తున్నా ఎక్కువ నిధులు పొందుతున్నాయి. ఇది ఆర్థిక న్యాయానికి విరుద్ధంగా ఉందని, దీని వల్ల దేశ ఐక్యతకు సవాలు ఎదురవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ వివక్ష నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.