- ప్రధాని, సీఎం నుంచి మంత్రుల వరకు వర్తింపు
- పార్లమెంటులో బిల్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం
- ప్రతిపక్ష నేతలే టార్గెట్ అంటూ గగ్గోలు
సహనం వందే, న్యూఢిల్లీ:
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన సీఎం, పీఎం తొలగింపు బిల్లు రాజకీయ రగడ రేపుతోంది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై నెల రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులను పదవి నుంచి తొలగించే ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దెబ్బతీసే కుట్రగా విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అధికార దుర్వినియోగం ద్వారా విపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు చేస్తున్న పన్నాగంగా ఈ బిల్లును చూస్తున్నాయి.
బిల్లు వెనుక రాజకీయ కుట్ర...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఇందులో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు, జమ్మూ కశ్మీరు పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లుల ప్రకారం… ఐదు సంవత్సరాలు లేదా అంతకు మించి శిక్ష పడే నేరారోపణలతో అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి పదవి ఆటోమాటిక్ గా రద్దవుతుంది. విపక్షాలు ఈ బిల్లును రాజకీయ కక్ష సాధింపు కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి విపక్ష నేతలను లక్ష్యంగా చేసే ఆయుధంగా చూస్తున్నాయి.
ప్రజాస్వామ్యంపై దాడి…
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఈ బిల్లును క్రూరమైన, రాజ్యాంగ విరుద్ధ చర్యగా విమర్శించారు. ఈ బిల్లును అవినీతి నిరోధక చర్యగా చెప్పడం ప్రజల కళ్లకు గంతలు కట్టడమేనని ఆమె అన్నారు. ఒక ముఖ్యమంత్రిపై తప్పుడు కేసు పెట్టి, దోషిగా నిర్ధారణ కాకముందే 30 రోజులు జైల్లో ఉంచితే, ఆయన పదవి కోల్పోవాల్సి వస్తుందని ఆమె ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆమె తేల్చి చెప్పారు. ఈ బిల్లు ద్వారా కేంద్రం విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.
బీజేపీ ద్వంద్వ వైఖరి…
కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఈ బిల్లును విపక్షాలను బలహీనపరిచే కుట్రగా అభివర్ణించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను ఉపయోగించి విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైలుపాలు చేసి పదవుల నుంచి తొలగించే వ్యూహమని ఆయన విమర్శించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఉదాహరణగా చూపారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఐదు నెలల పాటు జైల్లో ఉంచారని, ఈ బిల్లు అప్పట్లో అమలులో ఉంటే 31వ రోజున ఆయన పదవి కోల్పోయేవారని సింఘ్వీ గుర్తు చేశారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం జరగదని ఆయన విమర్శించారు.
గత అనుభవాల నీడ…
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ కూడా ఈ బిల్లు చర్చకు బలం చేకూర్చింది. మనీల్యాండరింగ్ కేసులో అరెస్టైన బాలాజీని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలో కొనసాగించారు. దీనిపై గవర్నర్‌తో వివాదం చెలరేగి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. చివరకు బాలాజీ రాజీనామా చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ, విపక్షాలు దీన్ని రాజకీయ ఆయుధంగా చూస్తున్నాయి.
బాబు, రేవంత్ లపై…
ఈ బిల్లు అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వంటి నేతలు గతంలో అరెస్టై జైలులో గడిపిన సందర్భాలను విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. చంద్రబాబు 2023లో 53 రోజులు, రేవంత్ రెడ్డి గతంలో 30 రోజులకు పైగా, జగన్ 16 నెలలు జైలులో గడిపారు. ఈ బిల్లు అమలులో ఉంటే వీరు పదవులు కోల్పోయేవారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వారి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసే కుట్రగా కాంగ్రెస్, తృణమూల్, ఎంఐఎం వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి.
బీజేపీకి కూడా బూమరాంగ్?
ఈ బిల్లు బీజేపీకి కూడా భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రేపు విపక్షంలోకి వచ్చినప్పుడు ఈ బిల్లు తమ నేతలపైనా ప్రభావం చూపవచ్చు. ఒక వ్యక్తిపై కేసు నమోదైనా, జైలులో ఉన్నా, నేరం రుజువు కాకముందే నిందితుడిగా మాత్రమే పరిగణించాలని, పదవి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ బీజేపీ ఈ బిల్లును ఎందుకు తీసుకొచ్చిందన్నది స్పష్టంగా తెలియడం లేదు. ఈ బిల్లు లోక్‌సభలో చర్చకు వచ్చినప్పుడు పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు. అయితే విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.